అయోధ్య రామాలయంపై ఈ రెచ్చగొట్టుడేంది అసద్?
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి అవుతున్న వేళ.. ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
By: Tupaki Desk | 3 Jan 2024 5:44 AM GMTమజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి అవుతున్న వేళ.. ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. మరిన్ని మసీదుల్ని తమ నుంచి తీసేసుకునే అవకాశం ఉందంటూ ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. తన ప్రసంగంలో భాగంగా అయోధ్య రామమందిర ప్రస్తావనను తీసుకొచ్చిన ఆయన తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది.
''గత 500ఏళ్లుగా ఖురాన్ పఠనం జరిగిన ప్రాంతం మనది కాకుండా పోయింది. మూడు.. నాలుగు మసీదుల విషయంలో జరుగుతున్న కుట్ర మీకు కనిపించట్లేదా? ఢిల్లీలోని సునెహ్రీ మసీదు కూడా ఆ జాబితాలో ఉంది. చాలా ఏళ్ల పాటు కష్టపడి మనం ఈ స్థాయికి చేరుకున్నాం. ఇలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయాలి. ముస్లింలు అందరూ ఐకమత్యంతో ఉండాలి'' అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ భవానినగర్ లో జరిగిన కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముస్లిం యువత తన బలాన్ని కాపాడుకోవాలన్న ఆయన.. మసీదుల్లో జనాల్ని ఎప్పుడూ ఉంచేలా చూసుకోవాలన్నారు. ''రేపటి వృద్ధుడు కాబోతున్న నేటి యువకుడు తన కళ్లను ముందు ఉంచుకొని.. తన కుటుంబానికి.. తన నగరానికి.. తన పొరుగువారికి ఎలా సాయం చేయాలో గట్టిగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నా. ఐక్యత ఒక బలం. ఐక్యత ఒక ఆశీర్వాదం'' అని పేర్కొన్నారు. తన ప్రసంగం అసాంతం ముస్లింలను రెచ్చగొట్టేలా.. వారిని భావోద్వేగానికి గురయ్యేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
''అందరం చనిపోతాం. కానీ చనిపోయిన తర్వాత అల్లాకు ఏ విధంగా మీ ముఖం చూపిస్తారు?'' అంటూ రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. అసుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ వార్నింగ్ ఇచ్చింది. ముస్లింలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వీహెచ్ పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. అసద్ లాంటి నేతలు ముస్లిం వర్గాల ప్రజలను పదే పదే రెచ్చగొట్టొద్దన్నారు. అభివ్రద్ధికి దారి తీయని చీకటి గల్లీలోకి ముస్లిం సమాజాన్ని నెట్టేస్తున్నారన్న ఆయన.. అసదుద్దీన్ వ్యాఖ్యలు చట్టపరమైన.. రాజ్యాంగ పరిధి దాటాయా? లేదా? అన్న అంశాన్ని పరిశీలిచాని తమ లీగల్ సెల్ టీంకు చెప్పామన్నారు.
''ముస్లిం సమాజంలో ఒక పెద్ద వర్గం ఈ గొప్ప ఆలయానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుండటాన్ని చూసి వారు మరింత నిరుత్సాహానికి గురవుతున్నారు. అందుకే ముస్లిం సమాజంలోని ఒక వర్గాన్ని హిందువులకు వ్యతిరేకంగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. అసద్ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులకు హిందూసేన ఫిర్యాదు చేసింది. మొత్తంగా చూస్తే.. అయోధ్యలోని వివాదాస్పద కట్టడంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగి.. దీనిపై తీర్పు వచ్చిన అనంతరం నిర్మితమవుతున్న ఆలయంపై అసదుద్దీన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధ్యత కలిగిన లోక్ సభ సభ్యుడిగా ఆయన తీరును తప్పుపడుతున్నారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన అసద్ పై చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.