మా పార్టీ మద్దతు ఆయనకే: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు బీఆర్‌ఎస్ కేనని ఆయన తేల్చిచెప్పారు.
By: Tupaki Desk | 17 Oct 2023 5:07 PM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టోల విడుదలపై దృష్టి సారించాయి. అధికార బీఆర్‌ఎస్ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు బీఆర్‌ఎస్ కేనని ఆయన తేల్చిచెప్పారు. ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉన్న చోట తమకు, ఎంఐఎం అభ్యర్థులు బరిలో లేనిచోట బీఆర్‌ఎస్ కు ముస్లింలు ఓట్లేయాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు.
తమను బీఆర్‌ఎస్ కు బీటీమ్ గా వస్తున్న ఆరోపణలపైనా అసదుద్దీన్ స్పందించారు. బీఆర్‌ఎస్ కు బీటీమ్ అని కాంగ్రెస్, కాంగ్రెస్ కు బీటీమ్ అని బీజేపీ ఇలా తమను అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. తాము ఎవరికీ బీటీమ్ కాదని.. తాము ఏటీమ్ అని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పోటీ చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసదుద్దీన్ ప్రశంసల వర్షం కురిపించారు. తొమ్మిదేళ్లుగా రైతుల కోసం బాగా పనిచేశారని కేసీఆర్ ను ప్రజలు నమ్ముతున్నారన్నారు. రైతు బీమాను కేసీఆర్ ప్రారంభించారన్నారు. దాన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాపీ కొట్టారని మండిపడ్డారు. ప్రజలు కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని భావిస్తున్నాను అని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
మరోవైపు ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఆకర్షించేలా ఉందని వెల్లడించారు. మైనార్టీలకు బడ్జెట్ పెంచుతామని చెప్పారన్నారు. అలాగే, ప్రజలకు రూ.400కే గ్యాస్ ఇస్తామని అన్నారని గుర్తుచేశారు.
కాగా తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న విషయంపైనా అసదుద్దీన్ స్పందించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని స్థానాల్లో పోటీచేస్తామన్న విషయం త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
కాగా, దేశ విభజన ఎన్నటికీ జరగకుండా ఉంటే బాగుండేదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత్–పాక్ విభజన జరగడం దురదృష్టకరమని తెలిపారు. దేశ విభజనకు బాధ్యులు ఎవరన్న విషయంపై చర్చ పెడితే తాను ఈ అంశాన్ని సంపూర్ణంగా వివరించి చెబుతానన్నారు.