Begin typing your search above and press return to search.

పాలస్తీనా ఎఫెక్ట్ : ఓవైసీ ఇంటిపై దాడి

దుండగుల రాళ్ల దాడిలో ఇంటి చుట్టూ రాళ్లు పడి ఉన్నాయని ఫిర్యాదులో వెల్లడించారు.

By:  Tupaki Desk   |   28 Jun 2024 4:19 AM GMT
పాలస్తీనా ఎఫెక్ట్ : ఓవైసీ ఇంటిపై దాడి
X

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ సమయంలో అసదుద్దీన్ రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఒవైసీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దాడిలో తన ఇంటి కిటికీలు పగిలిపోయాయని ఒవైసీ పోలీసులకు తెలిపారు. దుండగుల రాళ్ల దాడిలో ఇంటి చుట్టూ రాళ్లు పడి ఉన్నాయని ఫిర్యాదులో వెల్లడించారు.

తన ఇంటిపై రాళ్ల దాడి ఇది నాలుగో సారి అని, అమిత్ షా పర్యవేక్షణలోనే ఇది జరుగుతుందని, దయచేసి ఎంపీలకు భద్రత ఇస్తారో ? లేదో ? తెలపాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు. 2014 నుంచి ఇప్పటివరకు తన ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగిందని ఒవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన నివాసానికి వెళ్లి దర్యాప్తు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందుకే అసదుద్దీన్ ఒవైసీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తన ఇంటిని కొందరు టార్గెట్‌ చేసి మాటి మాటికి ఇలా దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక సారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల లోక్ సభలో సభ్యుడిగా ప్రమాణం చేసిన అసదుద్దీన్ జై పాలస్తీనా నినాదం చేయడం మూలంగానే తాజా దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు.