చెల్లికి తల్లి ప్రయారిటీ ఇస్తుందని ఇంట్లోనే చోరీ
ఇంట్లో చెల్లికి ప్రాధాన్యత పెరుగుతుందని.. తనను సరిగా చూడటం లేదన్న కోపానికి గురైన ఒక మహిళ.. సొంతింట్లోనే దొంగతనం చేసి అడ్డంగా బుక్ అయ్యింది.
By: Tupaki Desk | 5 Feb 2024 4:34 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో విచిత్రమైన ఉదంతం ఒకటి వెలుగు చూసింది. ఇంట్లో చెల్లికి ప్రాధాన్యత పెరుగుతుందని.. తనను సరిగా చూడటం లేదన్న కోపానికి గురైన ఒక మహిళ.. సొంతింట్లోనే దొంగతనం చేసి అడ్డంగా బుక్ అయ్యింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే అర్థమయ్యే విషయం ఒక్కటే. తప్పుడు పనులు చేసి తప్పించుకోవటం ఇప్పటి రోజుల్లో అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే.. పెరిగిన సాంకేతికత పుణ్యమా అని చిన్నతప్పును సైతం ట్రేస్ చేసే సత్తా పోలీసులకు ఉంది. అందుకే.. తప్పుడు పనులు చేస్తే అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఇక.. ఢిల్లీ ఎపిసోడ్ లోకి వెళితే..
31 ఏళ్ల శ్వేతకు చెల్లి మీద కోపం. తన తల్లి ఆమెకు ప్రాధాన్యత ఇస్తుందన్నది ఆమె ఆగ్రహం. కొంతకాలంగా వేరే చోట ఉంటున్న ఆమె.. తాజాగా తన తల్లిగారింట్లో దొంగతనానికి పాల్పడింది. ఇంట్లో బంగారం.. వెండితో పాటు రూ.25వేల క్యాష్ పోయిన నేపథ్యంలో ఇంట్లో చోరీ జరిగినట్లుగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటమే కాదు.. కన్నీళ్లుపెట్టుకొని మహానటికి మించిన రీతిలో ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలించారు.
భారీ వడబోతఅనంతరం.. బురఖా ధరించిన మహిళ ఒకరు అనుమానాస్పదంగా కనిపించారు. దీనిపై ఆరా తీయగా ఆమె శ్వేతగా గుర్తించారు. కంప్లైంట్ చేసిన వ్యక్తికి స్వయాన కుమార్తె కావటంతో ఇంట్లో వారితో కలిపి ఆమెను తీసుకొచ్చి అసలు విషయం వెల్లడించారు. దీంతో.. తన తల్లి చెల్లికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని.. అందుకే దొంగతనానికి పాల్పడినట్లుగా తాను చేసిన ఎదవ పనిని ఒప్పుకుంది. చోరీచేసిన నగల్ని అమ్మేసినట్లుగా చెప్పటంతో.. వాటిని రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. సొంతింటికే కన్నమేసిన కుమార్తె తీరుతో ఆ తల్లిదండ్రులకు షాక్ తిన్న పరిస్థితి.