ఓవర్ గా చెప్పుకొని అడ్డంగా బుక్ అయిన ‘ఓయో’
గొప్పలు చెప్పుకోవటం తప్పేం కాదు. ఆ క్రమంలో ఉత్సాహాన్ని డామినేట్ చేసే అత్యత్సాహం అసలే పనికి రాదు. ఈ విషయంలో ఓయో కాస్తంత ఓవర్ చేసిందన్నట్లుగా నెటిజన్లు మండిపడుతున్నారు.
By: Tupaki Desk | 22 Feb 2025 6:30 AM GMTగొప్పలు చెప్పుకోవటం తప్పేం కాదు. ఆ క్రమంలో ఉత్సాహాన్ని డామినేట్ చేసే అత్యత్సాహం అసలే పనికి రాదు. ఈ విషయంలో ఓయో కాస్తంత ఓవర్ చేసిందన్నట్లుగా నెటిజన్లు మండిపడుతున్నారు. తమ గురించి తాము గొప్పగా చెప్పుకునే క్రమంలో అనూహ్య రీతిలో బుక్ అయ్యింది ఓయో. దీనికి కారణం.. సదరు సంస్థ ఒక హిందీ పత్రికలో ఇచ్చిన అడ్వర్టైజ్ మెంట్ కావటం గమనార్హం. సదరు ప్రకటనపై నెటిజన్లు పలువురు తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ.. బాయ్ కాట్ పిలుపునివ్వటం.. అందరూ తలో చేయి వేయటంతో.. ఏదో అనుకుంటే మరేదో అయిన పరిస్థితిని గుర్తించి.. దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది.
అసలేం జరిగిందంటే.. ఒక హిందీ దినపత్రికలో ఓయో తన సేవల గురించి పేర్కొంటూ.. ‘దేవుడు ప్రతిచోటా ఉంటాడు. అలానే ఓయో కూడా’ అంటూ ఒక ప్రకటన ఇచ్చారు. దీనిపై పలువురు మండిపడుతున్నారు. తమ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఓయో వ్యవహరిస్తుందని పేర్కొంటూ పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాల్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీనికి పలువురు సానుకూలంగా స్పందిస్తూ.. బాయ్ కాట్ ఓమో అన్న హ్యాష్ ట్యాగ్ ను తీసుకురావటంతో.. అది కాస్తా ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది.
దీంతో ఉలిక్కిపడిన ఓయో.. తన ప్రకటన అసలు ఉద్దేశాన్ని వివరిస్తూ వివరణ ఇచ్చింది. తాము అజ్మేర్.. అయోధ్య.. వారణాశి.. ప్రయాగ్ రాజ్.. అమ్రత్ సర్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లోనూ సేవలు అందిస్తున్నామని చెప్పేందుకే ఈ ప్రకటన ఇచ్చామని వివరణ ఇచ్చింది. దేశంలో ఆధ్మాత్మిక పర్యటకాన్ని పెంచాలన్న ఉద్దేశమే తప్పించి ఎవరి మనోభావాల్ని దెబ్బ తీయాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.
సంప్రదాయాలకు నెలవైన భారతదేశంలో నమ్మకాలు.. విశ్వాసాల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందన్న ఓయో.. ఈ ఏడాది చివరనాటికి 12 ప్రధాన ఆధ్మాత్మిక నగరాల్లో 500 హోటళ్లను అందుబాటులోకి తీసుకురావాలన్న తన లక్ష్యాన్ని పేర్కొంది. తమ గురించి తాము గొప్పలు చెప్పుకునే వేళలోనూ.. కొన్ని పరిమితులకు లోబడి ఉండాలన్న విషయాన్ని ఓయో ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.