ముందస్తు బెయిల్ కోరిన మిథున్ రెడ్డి... కారణం క్లియర్!
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లోని లిక్కర్ పాలసీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 March 2025 9:46 AM ISTగత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లోని లిక్కర్ పాలసీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆ పాలసీ వల్ల అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు వినిపించాయి. దీంతో.. కూటమి ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసింది.. వైసీపీ మద్యం విధానం వల్ల రాష్ట్రానికి సుమారు రూ.18,860 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది.
ఇదే సమయంలో సిట్ ని ఏర్పాటు చేసింది. అంతకంటే ముందు గత ఏడాది సెప్టెంబర్ 23న సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ సమయంలో... లిక్కర్ స్కామ్ లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ స్కామ్ విషయంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయని కథనాలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ హయాంలో మద్యం కుంభకోణం వ్యవహారంపై గత ఏడాది సెప్టెంబర్ 23న ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ సమర్పించారు.
అవును... ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయనే చర్చ బలంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు ఇందులో కీలకంగా ఉన్నాయంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి! ఈ నేపథ్యంలో... వాటిని చూపిస్తూ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి.
మద్యం కుంభకోణం కేసులో తన పేరు చేర్చినట్లు ఇటీవల మీడియా కథనాలు వచ్చాయని ఆయన ప్రస్థావించారు. ఇదే సమయంలో... గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేకాధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం మీడియా ప్రచురించిందని ఆ పిటిషన్ లో వివరించారు.
ప్రధానంగా... గత ప్రభుత్వ హయాంలో కొన్ని మద్యం కంపెనీలకు నష్టం, మరికొన్నింటికి భారీ లబ్ధి కలిగేలా లావాదేవీలను తానే పర్యవేక్షించినట్లు అందులో ఆరోపించారని.. ఇవి పూర్తిగా నిరాధారమైనవని మిథున్ రెడ్డి తెలిపారు. అయితే.. ఈ కేసులో తనను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ప్రత్యేకాధికారి వాంగ్మూలంలోని అంశాలు వాస్తవమనుకున్నా.. ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించబోవని మిథున్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో.. ఏప్రిల్ 4 వరకూ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున లోక్ సభలో తాను హాజరుకావాల్సి ఉందని.. తన కస్టోడియల్ విచారణ అవసరం లేదని.. దర్యాప్తునకు సహకరిస్తానని.. ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా... గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ప్రభుత్వ నియంత్రణలో మద్యం అమ్మకాలకు ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వత.. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక మద్యం బ్రాండ్లను ప్రోత్సహించిందని ఆరోపించింది.. ఇవి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేశాయని తెలిపింది!
అనంతరం... గత ప్రభుత్వ పాలనలో మద్యం బ్రాండ్లు, వాటి అమ్మకాలు, లాభాలు మొదలైన విషయాలపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. మూడు నెలల్లోపు నివేదిక సమర్పించి దోషులను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది!