Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలపై అనర్హత సరే.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..?

ఏడేళ్లు కష్టపడి.. మూడేళ్లలో పోగొట్టుకున్నందుకు అసహనమో..? వచ్చేసారి ప్రభుత్వం వస్తే మంత్రి పదవి దక్కాలన్న లక్ష్యమో..?

By:  Tupaki Desk   |   11 Sep 2024 10:40 AM GMT
ఎమ్మెల్యేలపై అనర్హత సరే.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..?
X

ఏడేళ్లు కష్టపడి.. మూడేళ్లలో పోగొట్టుకున్నందుకు అసహనమో..? వచ్చేసారి ప్రభుత్వం వస్తే మంత్రి పదవి దక్కాలన్న లక్ష్యమో..? అసలు తాను ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నదీ మర్చిపోయారో..? మర్చిపోయినట్లున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఓవైపు స్పీకర్ కార్యాలయానికి సాక్షాత్తు హైకోర్టే నాలుగు వారాల గడువు ఇవ్వగా.. అది కూడా పట్టించుకోకుండా అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.. ఆయన తీరు చూసినవారంతా అనర్హత సరే.. ఇంత ఓవరాక్షన్ అవసరమా? కౌశిక్ రెడ్డి? అని విస్తుపోతున్నారు.

చేరికలు అప్పుడు.. ఇప్పుడు..

ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించడం అనేది ఇటీవల కాలంలో సహజంగా మారిపోయింది. అది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్య సభ సభ్యులైనా ఇదే తీరు. దీనికి ఆ పార్టీ ఈ పార్టీ అనికూడా తేడ లేదు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు దీనిని ప్రశ్నిస్తే రాజకీయ పునరేకీకరణ అని చెప్పింది. రెండోసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్నే విలీనం చేసుకుంది. మూడోసారీ గెలుస్తామన్న ధీమాతో ఎన్నికలకు వెళ్లి పరాజయం పాలైంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా తమ ఎమ్మెల్యేలను లాక్కుంటోందని గాయి గత్తర చేస్తోంది.

పది మంది జంప్ అయినా..

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఏడుగురు ఎమ్మెల్సీలూ జంప్ అయ్యారు. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుపై హైకోర్టులో కేసు నడుస్తోంది. కాగా, ఇదంతా అలా ఉండగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సొంత పార్టీ ఎమ్మెల్యేలను తీవ్రంగా తప్పుబట్టారు. మరో ఎమ్మెల్యే కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్)తో కలిసి.. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పును వెంటనే అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చీరె, గాజులు పంపించారు. వాటిని తొడుక్కొని నియోజకవర్గాల్లో పర్యటించాలంటూ హితవు పలికారు. వారికి ఇజ్జత్ లేదంటూ మండిపడ్డారు. కడియం శ్రీహరిని పచ్చి మోసగాడు, దానం నాగేందర్‌ ను బిచ్చగాడుగా అభివర్ణించారు. నాగేందర్ గతంలో కాంగ్రెస్- తెలుగుదేశం- కాంగ్రెస్- బీఆర్ఎస్- మళ్లీ కాంగ్రెస్.. ఇలా పూటకో పార్టీ మారుతూ వచ్చాడని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. హైదరాబాద్‌ లో దానం నాగేందర్‌ ను మించిన మోసగాడు మరొకరు ఉండరని విమర్శించారు. భవిష్యత్తులో ఆయన మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని జోస్యం చెప్పారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తోన్నారని కౌశిక్ రెడ్డి అన్నారు. వాళ్లకు డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు.

కొసమెరుపు: కేపీ వివేకానంద కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేనే. 2014లో టీడీపీ తరఫున గెలిచిన ఆయన అప్పటి అధికార బీఆర్ఎస్ లో చేరారు. మరి ఆయననే పక్కనపెట్టుకుని మాట్లాడారు కౌశిక్ రెడ్డి. దీనిని ఏమంటారో? మరి..?