Begin typing your search above and press return to search.

12 ఏళ్లకే పొలిటికల్ ప్రసంగాలు... హుజూరాబాద్ కి 1000 కోట్లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారాలు మరింత హోరెత్తిపోతున్నాయి

By:  Tupaki Desk   |   19 Nov 2023 5:04 AM GMT
12 ఏళ్లకే పొలిటికల్ ప్రసంగాలు... హుజూరాబాద్ కి 1000 కోట్లు!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారాలు మరింత హోరెత్తిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు. అభ్యర్థులే కాదు.. వాళ్ల కుటుంబ సభ్యులు కూడా వారి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. అభ్యర్థుల వెంట నిలబడుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది బహిరంగ సభల్లో ప్రసంగాలతో ఆకట్టుకుంటుంటే.. మరికొంతమంది ఇంటింటికీ తిరుగుతున్నారు.

ప్రజల్లోకి వచ్చి మరీ ప్రచారం చేస్తున్నాయి. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త.. తండ్రి కోసం కుమారులు, కుమార్తెలు బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే.. హుజూరాబాద్ బీఆరెస్స్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి కోసం తన కూతురు కూడా నడుం బిగించింది. కేవలం 12 ఏళ్ల వయసున్న పాడి శ్రీనిక.. భారీ స్థాయిలో హాజరైన సభను ఉద్దేశించి ప్రసంగించింది. ఈ సందర్భంగా ఆమె ప్రసంగానికి చప్పట్లు, ఈలలు వినిపించడం గమనార్హం.

అవును... "అందరూ ఎట్లున్నారు. మంచిగున్నారా. మమ్మల్ని దీవించేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నా వయసు ఇప్పుడు 12 ఏళ్లు. మా డాడీ నాతో రెండేళ్లు మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత మొత్తం మీతోనే ఉన్నాడు. దీంతో ఓసారి కోపమొచ్చి ఎన్నో జాబులుండగా ఇదే జాబ్ ఎందుకు తీసుకున్నావ్ అని అడిగా. దానికి... హుజూరాబాద్‌ ను మరో హైదరాబాద్‌ గా మార్చడమే తన కల అని చెప్పాడు" అని 12ఏళ్ల పిల్ల విజిల్స్ వేయించేలా ఎన్నికల వేళ బహిరంగ సభలో ప్రసంగించింది.

ఇలా సాగుతున్న ఆమె మాటల ప్రవాహంలో... "మనది చిన్న స్టేటే. మొన్ననే ఏర్పడింది. కానీ.. గూగూల్‌ లో బెస్ట్ డెవలపింగ్ స్టేట్ ఇన్ ఇండియా అని కొడితే తెలంగాణ అని వస్తది. మన కేసీఆర్ తాతా.. తెలంగాణ కోసం పోరాడి, అభివృద్ధి చేసి ఇండియాలోనే నెంబర్ వన్ స్టేట్‌ గా మార్చారు. అలాంటి కేసీఆర్‌ ను మూడోసారి సీఎం చేద్దాం. మా డాడీని గెలిపించి కేసీఆర్‌ కు గిఫ్ట్ పంపిస్తే.. మన హుజూరాబాద్‌ కు 1000 కోట్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా" అంటూ సంచలన పాయింట్లు ఎత్తుకోవడం మరో సంచలనం!

దీంతో ఈమె రాజకీయ ప్రసంగాలు, విషయ పరిజ్ఞానం, అంత చిన్న వయసులో సుమారు లక్షమంది ఉన్న బహిరంగ సభల్లో గుక్కతిప్పుకోకుండా ప్రసంగించడం చూసినవారు... పాడి కౌశిక్ రెడ్డికి అప్పుడే రాజకీయ వారసురాలు వచ్చేసింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.