షర్మిలపై విమర్శలు .. కాంగ్రెస్ నేతలకు నోటీసులు!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరుగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 23 Jun 2024 1:15 PM GMTఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరుగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. 2014లో జరిగిన రాష్ట్ర విభజన కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దీంతో 2014, 2019 ఎన్నికల్లోనూ.. ఆ పార్టీ కోలుకోలేని విధంగా మారిపోయింది. నోటా కన్నా తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఏపీలో పార్టీ పునరుజ్జీవం కోసం.. అంటూ దివంతగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా చేసిన పార్టీ అదిష్టానం.. ఎన్నికలకు ముందు ఆమెను ఏపీకి పంపించారు.
ఎన్నికల సమయంలో జోరుగా ప్రచారం చేసిన షర్మిల.. అప్పటి వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కొంగుచాపారు.. కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్న ప్రభుత్వంపై విమర్శలు దంచికొట్టారు. నిజానికి అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ని మించిపోయిన స్థాయిలో షర్మిల దూకుడు ప్రదర్శించారు. అయితే.. పార్టీని ప్రజలు ఈ సారి కూడా ఆదరించలేదు. కానీ, 1 శాతం ఉన్న ఓటు బ్యాంకు 2.8 శాతానికి మాత్రమే చేరుకుంది.
ఇదేసమయంలో వైసీపీ గెలుపును కూడా.. నిలువరించింది. కొన్ని కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఎఫెక్ట్ కారణంగా.. వైసీపీ నాయకులు కంచుకోటలను కూడా కోల్పోయారు. నిజానికి వైసీపీ అధినేత జగన్ కూడా.. గెలిచినా.. మెజారిటీపై షర్మిల ప్రభావం పడింది. ఇదిలావుంటే.. ఓడిపోయిన తర్వాత.. షర్మిల ను కేంద్రంగా చేసుకుని..కొందరు కాంగ్రెస్ నాయకులు.. రోడ్డెక్కారు. ఆమె నిర్వాకంతోనే తాము ఓడిపోయామ న్నారు. వ్యక్తిగత అంశాలను అజెండాగా చేసుకున్నారని.. ప్రజల సమస్యలు పట్టించుకోలేదన్నారు.
ఈ క్రమంలో సీనియర్ నాయకురాలు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుంకర పద్మశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల టికెట్లు అమ్ముకున్నారని.. తన అనుచరులకు మాత్రమే టికెట్ ఇచ్చుకున్నారని.. అందుకే పార్టీ ఓడిపోయిందన్నారు. అదేసమయంలో మరో నేత రాకేష్ రెడ్డి కూడా.. షర్మిలపై విరుచుకుపడ్డారు. కేంద్ర అధిష్టానానికి షర్మిల ఒంటెత్తు పోకడలపై ఫిర్యాదులు చేశారు. అయితే.. వీటిని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఫిర్యాదులు చేసిన వారికి సంజాయిషీ నోటీసులు పంపించింది. సమాధానం చెప్పాలని ఆదేశించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల స్థాయిలో కాంగ్రెస్ కమిటీలను కూడా రద్దుచేయడం గమనార్హం.