Begin typing your search above and press return to search.

పాక్ నటులను నిషేధించాలి... సుప్రీంలో పిటిషన్ కొట్టివేత!

ఈ సమయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ సందర్భంగా ఫైజ్‌ అన్వర్‌ ఖురేషి పిటిషన్‌ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:24 AM GMT
పాక్  నటులను నిషేధించాలి... సుప్రీంలో పిటిషన్  కొట్టివేత!
X

ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ) పాకిస్థానీ నటీనటులను నిషేధించాలనే నిర్ణయంపై ప్రముఖుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థించగా.. మరికొందరు దానిని తీవ్రంగా ఖండించారు. పాక్ నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఇండియన్ మూవీస్ లో పనిచేయకుండా నిషేధించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది.

ముంబైకి చెందిన ఫైజ్ అన్వర్ ఖురేషి అనే సినీ నటుడు బాంబే హైకోర్టులో గతంలో ఈ పిటిషన్ దాఖలు చేశాడు. పాకిస్థాన్ కళాకారులకు ఇండియన్ మూవీస్ లో అవకాశాలు ఇవ్వడంతో భారత చిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులు అవకాశాలు కోల్పోతున్నారని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఈ సమయంలో తాజాగా ఈ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ముందుగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా.. కళలు, సంగీతం, క్రీడలు వంటివి దేశాల మధ్య శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు తోడ్పడతాయని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో... అలాంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేమని తీర్పు వెలువరించింది.

దీంతో... బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సమయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ సందర్భంగా ఫైజ్‌ అన్వర్‌ ఖురేషి పిటిషన్‌ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

కాగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన సమయంలో బాలీవుడ్ లో నిరంతరాయంగా చర్చ జరుగుతున్న పాకిస్థాన్ దేశస్థులైన నటీనటులను నిషేధించటంపై పలువురు స్టార్ హీరోలు సూటిగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దక్షిణాది నుంచి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ బలంగా తన వాయిస్ ని వినిపించారు. మన దేశంలో వివిధ చిత్ర పరిశ్రమలలో ఉన్న పాకిస్థానీ కళాకారులను నిషేధించాలని తెలిపారు.