ఇండిపెండెన్స్ డే స్పెషల్... భారత్ కంటే ముందు పాక్ లో ఎందుకు?
ఇలా భారత్ కంటే ఒక్క రోజు ముందే పాకిస్థాన్ ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి గల కారణాలు ఇప్పుడు చూద్దాం!
By: Tupaki Desk | 14 Aug 2023 1:19 PM GMTదాదాపు వందేళ్లపాటు బ్రిటిషర్లతో పోరాడిన భారతీయులు స్వరాజ్యం కలను సాకారం చేసుకున్న రోజు 1947 ఆగస్టు 15! ఈ క్రమంలోనే పాకిస్థాన్ అనే కొత్త దేశం కూదా అవతరించింది. అయితే ఇండియాకు ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే ఇండియా నుంచి విడిపోయిన పాక్ ఆగస్టు 14న ఎలా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది?
అవును... పాకిస్థాన్ ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. భారత్ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుపుకుంటోంది ఎందుకు? సాధారణంగా చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఇది. ఇలా భారత్ కంటే ఒక్క రోజు ముందే పాకిస్థాన్ ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి గల కారణాలు ఇప్పుడు చూద్దాం!
అయితే ఇందుకు ప్రధానమైన కారణం... బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ గా ఉన్న మౌంట్ బాటెన్ బిజీ షెడ్యూలే! స్వాతంత్య్రం ఇచ్చినందుకు సూచికగా.. బ్రిటిష్ ప్రతినిధిగా ఆయన అధికారాలను ఇరు దేశాలకు బదలాయించాల్సి వచ్చింది. ఈ సమయంలో ముందుగా మౌంట్ బాటేన్ కరాచీ వెళ్లారు.
అలా కరాచీ వెళ్లిన బాటెన్.. పాకిస్థాన్ అధినేత మహ్మద్ అలీ జిన్నాకు ఆగస్టు 14న అధికారాలను బదలాయించారు. ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 15న భారత్ కు పాలనాధికారాలను బదలాయించారు.
అయితే ఆగస్టు 14న పాకిస్థాన్ కు అధికారాలు బదాలాయించిన మౌంట్ బాటెన్... "కొత్త దేశమైన పాకిస్థాన్ ప్రభుత్వం.. రేపటి నుంచి మీ చేతుల్లో ఉంటుంది" అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆగస్టు 15నే పాకిస్థాన్ ఇండిపెండెన్స్ డే అన్నమాట! అయితే ఆ విషయంలో అధికారాల బదలాయింపు జరిగిన రోజునే పాక్... తన ఇండీపెండెన్స్ ని జరుపుకుంటుంది.
1948 జులై వరకు పాకిస్థాన్ లో రిలీజ్ చేసిన పోస్టల్ స్టాంపుల్లోనూ ఆగస్టు 15నే ఇండిపెండెన్స్ డేగా పేర్కొన్నారు. 1948 జూన్ లో సమావేశమైన ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ నాయకత్వంలో సమావేశమైన పాకిస్థాన్ కేబినెట్.. భారత్ కంటే ముందే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతిపాదించింది.
దానికి జిన్నా ఆమోదం తెలపడంతో.. భారత్ కంటే ఒక రోజు ముందు, అంటే.. ఆగస్టు 14న పాకిస్థానీలు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో మతపరంగా కూడా ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాల్లో ఒకటి అని అంటుంటారు.
అవును... 1947 ఆగస్టు 14, 15 తేదీల మధ్య రాత్రి రంజాన్ నెలలో 27వ రోజు. దీన్ని పవిత్ర రంజాన్ మాసంలో శుభ దినంగా పరిగణిస్తారు. ఈ రకంగా కూడా పాకిస్థాన్ ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి ఇది కూడా ఓ కారణం అని చెబుతుంటారు!