Begin typing your search above and press return to search.

పాక్ వైమానికదాడిలో 15 మంది మృతి... ఆ 7 గ్రామాలే టార్గెట్!

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే యుద్ధ వాతావరణం పీక్స్ కి చేరిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Dec 2024 5:46 AM GMT
పాక్ వైమానికదాడిలో 15 మంది మృతి... ఆ 7 గ్రామాలే టార్గెట్!
X

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే యుద్ధ వాతావరణం పీక్స్ కి చేరిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క రష్యా-ఉక్రెయిన్.. మరోపక్క గాజా, ఇరాన్, సిరియాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దాడుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ దాడులు మొదలుపెట్టింది!

అవును... పక్కనున్న దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడటంలో ముందుంటుందనే పేరు సంపాదించుకున్న పాకిస్థాన్... ఈసారి ఆఫ్ఘనిస్తాన్ ను టచ్ చేసింది. ఇందులో భాగంగా... ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులు చేసింది. బార్మల్ జిల్లాలోని పక్తికా ప్రావిన్స్ లోని ఏడు గ్రామాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు.

ఈ దాడుల్లో ఇప్పటివరకూ మహిళలు, చిన్నారులతో సహా 15 మంది మృతి చెందారు. అయితే.. ఈ దాడులకు పాకిస్థాన్ విమానాలే కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ దాడుల్లో ప్రస్తుతానికి మృతుల సంఖ్య 15 గా ఉండగా.. ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువగా వజీరిస్థానీ శరణార్థులే ఉన్నారని అంటున్నారు.

ఈ దాడులపై తాజాగా తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇందులో భాగంగా... పాకిస్థాన్ చేసిన దాడులను ఖండించింది. వీటికి త్వరలో ప్రతీకార చర్యలు ఉంటాయని ప్రతిజ్ఞ చేసింది. అయితే... ఈ దాడులు తామే చేశామని పాకిస్థాన్ నుంచి ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదని అంటున్నారు.

కాగా... పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సందర్భంగా ఇటీవల తమ దేశంలో జరిగిన ఉగ్రదాడులకు తాలిబాన్లే కారణమని పాకిస్థాన్ ఆరోపించగా.. ఆ ఆరోపణలను తాలిబన్ ప్రభుత్వం ఖండించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ వైమానిక దాడులు చేసినట్లు చెబుతున్నారు.