Begin typing your search above and press return to search.

భయం గుప్పిట్లో పాకిస్థాన్ లోని హిందువులు.. కారణం దారుణం!

దుర్గామాత విగ్రహం పెట్టుకోవాలన్నా కప్పం కట్టాలి అనే అనధికారిక అల్టిమేట్టాలు జారీ అయ్యాయనే వార్తలొచ్చాయి

By:  Tupaki Desk   |   11 Oct 2024 2:30 AM GMT
భయం గుప్పిట్లో పాకిస్థాన్  లోని హిందువులు..  కారణం దారుణం!
X

నిన్న బంగ్లాదేశ్ లో హిందువులు బిక్కుబిక్కుమంటూ ఉన్నట్లు వార్తలొచ్చాయి. దుర్గామాత విగ్రహం పెట్టుకోవాలన్నా కప్పం కట్టాలి అనే అనధికారిక అల్టిమేట్టాలు జారీ అయ్యాయనే వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజాగా పాకిస్థాన్ లోని హిందూ సమాజం భయం నీడలో బ్రతుకున్నారనే విషయం తెరపైకి వచ్చింది. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... పాకిస్థాన్ లోని హిందూ సమాజానికి కష్టాలు పెరుగుతున్నాయని అంటున్నారు. దక్షిణ సింధ్ ఫ్రావిన్స్ లో నివసిస్తున్న హిందూ సమాజానికి చెందిన వారిని బెదిరిస్తున్నారని.. వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. దీంతో వారంతా భయం గుప్పిట్లో జీవిస్తున్నారని అంటున్నారు. ఈ బెదిరింపుల కారణంగా కొంతమంది తమ తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది.

దక్షిణ సింధ్ ఫ్రావిన్స్ లో దైవదూషణ ఘటన జరిగిందని హిందువుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన పాకిస్థాన్ దర్వార్ ఇత్తెహాద్ అనే సంస్థ అధిపతి శివ్ కూచి తెలిపారు. ఈ ఘటన తర్వాత కొంతమంది.. హిందూ సమాజానికి చెందిన వ్యక్తులపై బెదిరింపులు జారీ చేసినట్లు చెబుతున్నారు. అయితే... ఇలా బెదిరింపులకు పాల్పడినవారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకూ చర్యలు తీసుకోలేదట.

ఈ నేపథ్యంలోనే హిందూ సమాజం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్లు చెబుతున్నారు. కాగా... గత నెల ఎగువ సింధ్ లోని ఉమర్ కోట్ లో ఓ హృదయ విదారక ఘటన జరిగింది. ఇక్కడ పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో డాక్టర్ షానవాజ్ కుంభార్ మరణించారు. అయితే ఈ ఎన్ కౌంటర్ కి ముందు డాక్టర్ షానవాజ్ పై దైవదూషణ ఆరోపణలు వచ్చాయని అంటున్నారు.

అయితే వాటిని ఎన్ కౌంటర్ కు ఒక రోజు ముందే డాక్టర్ షానవాజ్ ఖండించారు.. అదంతా అసత్య ప్రచారమని కొట్టిపరేశారు. ఆ మరుసటి రోజే ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఈ సమయంలో డాక్టర్ షానవాజ్ మృతదేహాన్ని దహనం చేయడానికి వెళ్తున్న క్రమంలో అతని కుటుంబానికి సహాయం చేయడానికి హిందూ సమాజ సభ్యులు పలువురు ముందుకు వచ్చారు.

అయితే వారిపైనా పలువురు దాడికి ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని అక్కడున్న హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... హిందువులను బెదిరించినట్లు ఫిర్యాదులు అందాయి కానీ.. దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఉమర్ కోట్ పోలీసు అధికారి చెప్పుకొస్తున్నారు!