Begin typing your search above and press return to search.

పాక్ లో రైలు హైజాక్.. చాంపియన్స్ ట్రోఫీ వేళ జరిగి ఉంటే.. గగ్గోలే?

పాకిస్థాన్ లో సోమవారం జరిగిన రైలు హైజాక్ ఘటన అందరినీ హడలెత్తిస్తోంది.

By:  Tupaki Desk   |   12 March 2025 1:53 PM IST
పాక్ లో రైలు హైజాక్.. చాంపియన్స్ ట్రోఫీ వేళ జరిగి ఉంటే.. గగ్గోలే?
X

‘‘ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది.. కానీ, సైన్యానికే ఒక దేశం ఉంది.. అది పాకిస్థాన్’’. ఇది పైకి చెప్పడానికి జోక్ గా ఉన్నప్పటికీ, పచ్చి నిజం. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పటికీ పాకిస్థాన్ లో సైన్యానిదే పెత్తనం. ఆ సైన్యం.. మూడు దశాబ్దాలుగా భారత్ పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ వస్తోంది. చివరకు అదే వారి పాలిట పాముగా మారింది.

సహజంగా అంతర్జాతీయ క్రికెట్ జట్లు పర్యటన అంటే అత్యున్నత స్థాయి భద్రత ఉంటుంది. అలాంటిది 2009లో పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టుపై లాహోర్ లో దాడి జరిగింది. ఇది ప్రపంచ క్రికెట్ నే కుదిపేసింది.

2009 తర్వాత పాకిస్థాన్ లో పర్యటనకు ఏ విదేశీ జట్టూ ముందుకు రాలేదు. చివరకు తటస్థ వేదికగా దుబాయ్ ను ఎంచుకుని పాకిస్థాన్ ఇతర జట్లతో మ్యాచ్ లు ఆడే పరిస్థితి వచ్చింది. నాలుగైదేళ్లుగా మాత్రమే తిరిగి జట్లు పాక్ లో టూర్ చేస్తున్నాయి.

ఇక భారత్ ముంబై దాడుల తర్వాత పాకిస్థాన్ తో క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు చేసుకుంది. ఆ దేశంలో పర్యటించేది లేదని తేల్చిచెప్పింది. మొన్నటి చాంపియన్స్ ట్రోఫీకి కూడా వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టడంతో చేసేదేం లేక టీమ్ ఇండియా మ్యాచ్ లు దుబాయ్ లో ఆడేందుకు ఒప్పుకొన్నారు.

చాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పోటీపడగా భారత్ తప్ప మిగతావన్నీ పాకిస్థాన్ లోనే ఆడాయి. వీటిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లు ఉన్న సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ లో సోమవారం జరిగిన రైలు హైజాక్ ఘటన అందరినీ హడలెత్తిస్తోంది.బలోచ్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న ప్రయాణికుల్లో 104 మందిని భద్రతా బలగాలు సురక్షితంగా విడిపించాయి. 182 మందిని బందీలుగా తీసుకెళ్లగా 104 మంది బయటపడ్డారు. 16 మంది ఉగ్రవాదులను సైన్యం చంపేసింది. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. మిగిలినవారందరినీ రక్షించేందుకు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. రైలులో పలువురు ప్రభుత్వాధికారులు సైతం ఉన్నారు. పెషావర్, క్వెట్టాలలో పాక్‌ రైల్వే ఎమర్జెన్సీ డెస్క్‌ ఏర్పాటుచేసింది.

ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రైలు హైజాక్ ఘటన జరిగి ఉంటే..? ప్రపంచమంతా గగ్గోలు రేగేది. మరీ ముఖ్యంగా ప్రాణాలు బాగా విలువ ఇచ్చే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు వెంటనే టోర్నీ నుంచి వెళ్లిపోయేవారు. అవసరమైతే ఆయా దేశాలు తమ టీమ్ లను వెనక్కు రప్పిస్తాయి.

ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీకి భారత్ పాకిస్థాన్ కు వెళ్లకపోవడం మంచి నిర్ణయమేనేమో?