పాక్ లో మహిళల పరిస్థితి దారుణం... నటి సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్ లో మహిళల పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 19 Dec 2023 10:30 AMవన్ డే క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో పాకిస్థాన్ కు చెందిన మరోనటి ఆయేషా ఒమర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా పాక్ లో మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్రయాలు కరువయ్యాయని అన్నారు.
అవును... పాక్ అద్భుతం, భారత్ ఘోరం అన్నట్లుగా పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ ఆన్ లైన్ వేదికగా కబుర్లు చెబుతున్న నేపథ్యంలో... అసలు తమ దేశంలో తనకు రక్షణ లేకుండా పోయిందంటోంది మరో నటి ఆయేషా ఒమర్. ఇందులో భాగంగా... పాకిస్థాన్ లో తనతో పాటు మహిళలందరికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కరువయ్యాయని కుండబద్దలు కొట్టింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్ లో మహిళల పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయేషా ఒమర్.. తనకు పాకిస్థాన్ లో సేఫ్ గా అనిపించడం లేదని.. కాసేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి బయటకు వెళ్లాలనిపిస్తుందని.. సరదాగా సైకిల్ తొక్కాలని, వాకింగ్ చేయాలనీ అనిపిస్తుంటుంది కానీ... ఇక్కడ ఏదీ చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కరాచీ ఏమాత్రం సురక్షితమైన ప్రదేశం కాదనిపిస్తోందని తెలిపింది.
ఇదే సమయంలో... పాకిస్థాన్లో తనకు ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతోందని.. బహుశా పాకిస్థాన్ లోని చాలామంది మహిళల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండొచ్చని అభిప్రాయపడింది. ఇక్కడివాళ్లు ప్రతి క్షణం భయపడుతూ నరకం చూస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తనపై రెండుసార్లు దాడి జరిగిందని ఆయేషా ఒమర్ గుర్తు చేసుకున్నారు.
ఇదే క్రమంలో... ఇంటినుంచి బయటకు వెళ్తే చాలు వేధిస్తున్నారని.. ఫలితంగా ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లభించట్లేదనే భావన కలుగుతుందని.. ఎప్పుడు, ఎవరు.. ఎటు నుంచి వచ్చి కిడ్నాప్ చేస్తారో, అత్యాచారం చేస్తారోనని చాలా భయంగా ఉందని ఆమె తెలిపారు. ఇదే సమయంలో... పాక్ లో మహిళలు ఎంత ఇబ్బందిపడుతున్నారనే విషయం ఇక్కడి మగవాళ్లు ఎంత ప్రయత్నించినా అస్సలు అర్థం చేసుకోలేరని ఆమె తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి!
కాగా ఈ నటి సోదరుడు పాకిస్తాన్ ను వదిలి డెన్మార్క్ కు వెళ్లి అక్కడే సెటిలయ్యాడని చెబుతుంటారు. ఇదే క్రమంలో ఆమె తల్లి కూడా దేశాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయలో ఆయేషా మాత్రం తనకు పాకిస్తాన్ అంటే ఇష్టమని చెబుతూనే... తనను ఇక్కడ ప్రశాంతంగా బతకనిచ్చేలా లేరని చెబుతుంది. పాక్ లో అందరి మహిళల పరిస్థితి దాదాపు ఇలానే ఉందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు!