పాకిస్థాన్‌లో సైనిక తిరుగుబాటు తప్పదా? మారుతున్న పవనాలు!
సైనిక తిరుగుబాటుకు ఆలవాలంగా మారిన దాయాది దేశం
By: Tupaki Desk | 25 July 2023 10:41 AM GMTసైనిక తిరుగుబాటుకు ఆలవాలంగా మారిన దాయాది దేశం పాకిస్థాన్‌లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగేందుకు రంగం సిద్ధమైందా? ఆదిశగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ దూకుడుగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు. గతంలో ముషారఫ్ వంటివారు సైనిక తిరుగుబాటు చేసి అధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆర్మీచీఫ్ జనరల్ ఆసి మునీర్ కూడా.. చేరుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏం జరిగిందంటే..
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్.. అప్పుల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి కొంత మొత్తాన్ని రుణంగా తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, ఇప్పటికే చైనా నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకున్న నేపథ్యంలో ఈ రుణాలపై దేశంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోం ది. దీనిని కోట్ చేస్తూ.. పాకిస్థాన్ విదేశీ రుణాలపై ఆధారపడటాన్ని మానేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ హితవు పలికారు.
అంతేకాదు.. ప్రభుత్వం తన సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని అన్నారు. ''పాకిస్థానీలు ఉత్సాహవంతులు, ప్రతిభావంతులు, గర్వించ దగినవారు. పాక్ వాసులు కచ్చితంగా చిప్పను (బెగ్గర్స్ బౌల్) విసిరేయాలి'' అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు దేవుడు అన్ని రకాల శక్తులను ఇచ్చాడని ఆసిం మునీర్ అన్నారు. తమ దేశ ప్రగతిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని తెలిపారు. దేశం, ప్రజల మధ్య తల్లీబిడ్డల బంధం ఉందని ఆయన వెల్లడించారు.
అయితే, చైనా నుంచి పాక్ రుణం తీసుకునేందుకు రెడీ అయిన సమయంలో ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పైగా. ఆయన దేశ రక్షణ విషయాన్ని వదిలేసి.. పాలన విషయాన్ని భుజాన వేసుకోవడం మరింత ఆసక్తిగా మారిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌లో సైనిక తిరుగుబాటు జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇదిలావుంటే, ఈ నెలలో పాక్ ప్రభుత్వం మొత్తం 2.44 బిలియన్ డాలర్ల మేరకు అప్పు చేసింది. వీటిల్లో చైనా నుంచే 2.07 బిలియన్ డాలర్లు ఉండడం గమనార్హం.