Begin typing your search above and press return to search.

ఆ దేశంలో ఈ స్థాయిలో మారణకాండ ఎందుకు?

భారత్‌ శత్రు దేశం.. పాకిస్థాన్‌ నెత్తురోడింది. ఆ దేశంలో ఎప్పటి నుంచో బలూచిస్తాన్‌ ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని వేర్పాటువాదులు డిమాండ్‌ వినిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Aug 2024 6:45 AM GMT
ఆ దేశంలో ఈ స్థాయిలో మారణకాండ ఎందుకు?
X

భారత్‌ శత్రు దేశం.. పాకిస్థాన్‌ నెత్తురోడింది. ఆ దేశంలో ఎప్పటి నుంచో బలూచిస్తాన్‌ ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని వేర్పాటువాదులు డిమాండ్‌ వినిపిస్తున్నారు. విదేశాల వేదికగానూ తరచూ నిరసన ప్రదర్శనలు చేస్తూ తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో వేర్పాటువాదులు రెచ్చిపోయారు. పాకిస్థాన్‌ లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌ లో పలు ప్రాంతాల్లో మారణకాండకు దిగారు. పలు పోలీసు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వాహనాలపై కాల్పులకు పాల్పడి 39 మందిని అంతమొందించారు. ఇందుకు తమదే బాధ్యతని బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించుకుంది. ఈ మారణకాండను పాకిస్థాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీప్‌ తీవ్రంగా ఖండించారు.

పాకిస్థాన్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ లోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. రెండు రోజుల్లో జరిగిన ఈ «ఘటనల్లో 39 మందిని హతమార్చారు.

మొదటి కాల్పుల ఘటన బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌ లోని ముసాఖేల్‌ జిల్లాలోని రరాషమ్‌ లో జరిగింది. ఇక్కడ పంజాబ్‌ నుంచి వస్తున్న బస్సులపై కాల్పులకు దిగడంతో అందులోని 23 మంది మృత్యువాత పడ్డారు. ముందుగా 10 సాయుధులు బస్సులను చుట్టుముట్టి ఆపారు. ప్రయాణికుల గుర్తింపు పత్రాలను తనిఖీ చేశాక.. వారిలో పంజాబ్, ఖైబర్‌ పంక్తువ్వా ప్రావిన్స్‌ లకు చెందిన వారిని కిందకు దింపి 23 మందిని కాల్చిచంపారు. అనంతరం 10 మంది సాయుధులు సమీపంలోని కొండ ప్రాంతంలోకి పరారయ్యారు.

అలాగే రెండో ఘటన కలత్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక్కడ 11 మందిని కాల్చిచంపారు. ఈ ఘటనలో అయిదుగురు పౌరులు సహా ఆరుగురు భద్రతా సిబ్బందిని బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ కాల్చి చంపింది.

ఇక మూడో ఘటన బలూచిస్థాన్‌ గిరిజన నాయకుడు నవాబ్‌ అక్బర్‌ ఖాన్‌ బుగ్టీ వర్ధంతి సందర్భంగా చోటు చేసుకుంది. బొలాన్‌ జిల్లా కొల్పూర్‌ లో జరిగిన ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు.

కాగా లిబరేషన్‌ ఆర్మీ సాయుధులు బొగ్గుతో వెళ్తున్న ర వాణా వాహనాలను కూడా ఆపి అందులోని డ్రైవర్లను కూడా కాల్చిచంపారని ప్రభుత్వం తెలిపింది. పది ట్రక్కులను నిప్పుపెట్టారని వెల్లడించింది.

మరో ఘటనలో బోలాన్‌ జిల్లా డొజోన్‌ ప్రాంతంలో పాకిస్థాన్‌ – ఇరాన్‌ ను కలిపే రైల్వే మార్గంలో వంతెనను కూడా పేల్చివేశారు.

బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ దాడులతో పాకిస్తాన్‌ సైన్యం రంగంలోకి దిగింది. 12 మంది లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మిలిటెంట్లను హతమార్చింది.

సహజవనరులు పుష్కలంగా బలూచిస్థాన్‌ పాకిస్థాన్‌ లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారు. ఇక్కడి సంపదను హరిస్తున్న ప్రభుత్వం తమను అభివృద్ధి చేయడం లేదని ప్రజల్లో ఆగ్రహం గూడుకట్టుకుని ఉంది.