Begin typing your search above and press return to search.

భారత్ – పాక్ సరిహద్దులో అలజడి... పాక్ టీమ్ "బ్యాట్" గురించి తెలుసా?

ఈ సందర్భంగా స్పందించిన సైన్యం... ఇది పాక్ ఆర్మీకి చెందిన “బోర్డర్ యాక్షన్ టీమ్” (బ్యాట్) దాడి అని స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   27 July 2024 3:15 PM GMT
భారత్ – పాక్ సరిహద్దులో అలజడి... పాక్ టీమ్ బ్యాట్ గురించి తెలుసా?
X

భారత్ – పాక్ సరిహద్దుల్లో మరోసారి అలజడి చెలరేగింది. ఈ సందర్భంగా... భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్ ఆర్మీని భారత సైన్యం తరిమికొట్టింది. జమ్మూకశ్మీర్ లోని కుప్వారాలో ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన సైన్యం... ఇది పాక్ ఆర్మీకి చెందిన “బోర్డర్ యాక్షన్ టీమ్” (బ్యాట్) దాడి అని స్పష్టం చేసింది.

ఇదే సమయంలో... ఈ దాడిలో పాకిస్థాన్ కు చెందిన ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారని భారత సైన్యం తెలిపింది. పాక్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ ఉగ్రవాదుల బృందాన్ని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తోందని.. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఈ ఉగ్రవాదులకు, భారత బలగాలకూ మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని చెబుతున్నారు.

జూలై 27 తెల్లవారుజామున మచల్ సెక్టార్ లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్ వైపు వెళ్తున్న పలువురిని భద్రతా దళాలు పసిగట్టాయి. ఈ సమయంలో వారిని ప్రశ్నించాలని సైన్యం నిర్ణయించుకుంది. ఈ లోపు పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఈ బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది. దీంతో.. అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.

సుమారు మూడు గంటలు జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఈ బ్యాట్ టీమ్ గురించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. పాక్ ఆర్మీకి చెందిన ఈ టీం ఫామ్ అవ్వడంలో చైనా పాత్ర కూడా ఉందని అంటుంటారు!

ఏమిటీ "బ్యాట్"..?

బ్యాట్ (బీఏటీ) అనేది పాకిస్థాన్ సరిహద్దుల్లోని యాక్షన్ టీమ్. ఇది నియంత్రణ రేఖ (ఎల్.వో.సీ) వెంబడి సరిహద్దు కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారత్ పై దాడులు నిర్వహిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటుంది. ఇది పాకిస్థాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ లో ఓ ప్రధాన భాగంగా ఉంది. ఇందులో ఉగ్రవాదులు కూడా సభ్యులే!!

అవును... ఈ బ్యాట్ కు ఎంపికయినవారు ఎనిమిది నెలల పాటు పాకిస్థాన్ సైన్యంలోనూ, నాలుగు వారాలపాటు పాకిస్థాన్ వైమానిక దళంలోనూ శిక్షణ పొంది ఉంటారు. ఈ బ్యాట్ సభ్యుల్లో పాకిస్థాన్ ఆర్మీ తో పాటు ఉగ్రవాదుల కమాండోలు కూడా ఉండటం గమనార్హం. అంటే.. ఉగ్రవాదులతో కలిసి సైన్యాన్ని నడుపుతున్న ప్రజాస్వామ్య దేశం పాక్ అన్నమాట!!

ప్రధానంగా బ్యాట్ లో ఉగ్రవాదులను ఎంచుకోవడంలో పాక్ ఎత్తుగడ వేరే ఉందని అంటుంటారు. ఇందులో భాగంగా... భారత్ సైన్యం చేతికి ఈ ఉగ్రవాదులు సజీవంగానో, నిర్జీవంగానో చిక్కితే అప్పుడు వారితో తమకు సంబంధం లేదని, వారు ఉగ్రవాదులని, వారితో పాక్ సైన్యానికి, ప్రభుత్వానికీ ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్ ప్రపంచం ముందు బొంకుతుందన్నమాట.

పాక్ "బ్యాట్" కు చైనా పరోక్ష మద్దతు!:

ఇలా ఉగ్రవాదులనే సైన్యంలో చేర్చుకుని నిస్సిగ్గు చర్యలకు పాల్పడుతున్న పాక్ "బ్యాట్"కు చైనా నుంచి పరోక్ష మద్దతు ఉందనేది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయంగా ఉంది. దానికి కారణం... శత్రువు యొక్క శత్రువు.. మిత్రుడు కావడమే! ఈ నేపథ్యంలోనే ఆసియా ఖండంలో చైనాను అన్ని రకాలుగానూ నిలువరిస్తున్న భారత్ ను చికాకు పెట్టాలని చైనా భావిస్తుంటుంది.

అలాంటి ఆలోచనలున్న చైనాకు ఈ పాకిస్థాన్ కు చెందిన "బ్యాట్" సహకారం ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే... జమ్మూ, పంజాబ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకేసారి అలజడి సృష్టిస్తే.. అప్పుడు భారత్ తన సైనికులను తలో దిక్కుకూ పంపుతుందని.. అదే అదనుగా అరుణాచల్ ప్రదేశ్, గల్వాన్ లలో ముందుకు సాగొచ్చనేది డ్రాగన్ వ్యూహమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.