దాయాదికి కనీస మానవత్వం కూడా ఉండదా?
తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని దేశాన్నివిడిచి వెళ్లిపోమనటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. అలా చెప్పిన తర్వాత దేశాన్ని వీడుతున్న వారి నుంచి వసూలు చేస్తున్న సుంకం తీరు షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 26 Nov 2023 5:45 AM GMTకనీస మానవత్వం అన్నది లేకుండా చేస్తోంది దాయాది పాకిస్థాన్. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని దేశాన్నివిడిచి వెళ్లిపోమనటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. అలా చెప్పిన తర్వాత దేశాన్ని వీడుతున్న వారి నుంచి వసూలు చేస్తున్న సుంకం తీరు షాకింగ్ గా మారింది. అసలు కష్టాల్లో ఉన్న వారిని ఆదరించకున్నా ఫర్లేదు కానీ.. వారి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్న వైనం చూస్తే.. అయ్యో అనిపించకమానదు.
ఇప్పటికే పీకల్లోతు అప్పుల పాలైన పాకిస్థాన్.. తనకు ఆదాయం వచ్చే ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టటం లేదు. తాజాగా అలాంటి మార్గాన్నే ఎంచుకున్న వైనం ప్రపంచ వ్యాప్తంగా నిరసనల్ని వ్యక్తమయ్యేలా చేస్తోంది. ఆఫ్ఘానిస్థాన్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ దేశం నుంచి భయాందోళనలతో పాకిస్థాన్ కు చేరుకున్నారు ఆఫ్ఘాన్ పౌరులు. 2021లో అప్ఘానిస్థాన్ లోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి.. రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్ల ఎపిసోడ్ లో.. భయాందోళనలో మునిగిన లక్షలాది మంది దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవటం తెలిసిందే.
సంపన్నులు.. ఆర్థికంగా అంతో ఇంతో బలంగా ఉన్న వారంతా.. విమాన టికెట్లు కొనుక్కొని యూరోపియన్ దేశాలకు వెళ్లిపోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారు రోడ్డు మార్గాన పాకిస్థాన్ కు చేరుకొని తలదాచుకున్నారు. లక్షలాది మంది విదేశాలకు వెళ్లిపోగా.. వారిలో పాకిస్థాన్ కు శరణార్థులుగా వలస వెళ్లిన వారి సంఖ్య దాదాపు 21.3 లక్షలుగా చెబుతారు.
అనుమతులు లేకుండా తమ దేశంలో నివసిస్తున్న ఆఫ్ఘాన్ పౌరుల్ని నవంబరు ఒకటినాటికి తమ దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలని పాక్ ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. దీంతో.. పాక్ లో ఉంటున్న ఆఫ్ఘాన్ శరణార్థులు వారి దేశానికి వెళ్లిపోతున్నారు. ఇలాంటి వేళ. వారిపై ఎగ్జిట్ పన్ను పేరుతో కొత్త రూల్ తీసుకొచ్చింది. తమ దేశంలో లక్షలాది మంది ఉన్న నేపథ్యంలో వారంతా తిరిగి వెళ్లే క్రమంలో కచ్ఛితంగా 830 డాలర్లు మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.69వేల వరకు చెల్లిస్తే కానీ దేశాన్ని విడిచిపెట్టేందుకు అనుమతులు ఇవ్వకుండా ఉండేలా రూల్ పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా.. ఈ విధానంపై మార్పు ఉండదని పాక్ విదేశాంగ శాఖ వెల్లడించటం గమనార్హం. ఇదంతా చూస్తే.. లక్షలాది మంది నుంచి రూ.69వేల చొప్పున లెక్కిస్తే భారీ మొత్తమే సమకూరుతుంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశానికి అదనంగా వచ్చే ఈ సొమ్ము అంతో ఇంతో ఊపిరి పీల్చుకునేలా చేస్తుందని చెప్పక తప్పదు.