భారత్ పై పాక్ ప్రశంసల జల్లు... ఇస్రో శాస్త్రవేత్తలపై కీలక వ్యాఖ్యలు!
భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ - 3.. జాబిల్లిపై తన పని తాను చేసుకుపోతోంది
By: Tupaki Desk | 26 Aug 2023 9:31 AM GMTభారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ - 3.. జాబిల్లిపై తన పని తాను చేసుకుపోతోంది. చంద్రయాన్ - 3 సక్సెస్ అయిన వెంటనే ప్రపంచం మొత్తం భారత్ ను ప్రశంసలతో ముంచెత్తింది. శత్రువులు, మిత్రులు అనే తారతమ్యాలేమీ లేకుండా... భారత్ ను ఆకాశానికి ఎత్తేశాయి.
ఈ సమయంలో మైకందుకుంది పాక్. వాస్తవానికి చంద్రయాన్ - 3 సక్సెస్ అయిన వెంటనే ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు పాక్ మీడియా కూడా విపరీతమైన కవరేజ్ ఇచ్చింది. ఇస్రోపై ప్రశంసల జల్లులు కురిపించింది. ఈ క్రమంలో తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం స్పందించింది.
అవును... చంద్రయాన్ - 3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల పాకిస్తాన్ స్పందించింది. కాస్త ఆలస్యంగానైనా సానుకూలంగా స్పందించింది. చంద్రయాన్ - 3ని ప్రయోగించడం, చంద్రుడిపై దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడాన్ని శాస్త్ర, సాంకేతికపరంగా గొప్ప విజయమని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదే సమయంలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్.. ఇస్లామాబాద్ లో విలేకరుల సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ 3 అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా సానుకూలంగా స్పందించారు.
చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇస్రో.. ల్యాండింగ్ మాడ్యూల్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడాన్ని గొప్ప సైంటిఫిక్ విజయంగా ఆమె అభివర్ణించారు. ఇదే సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రశంసలకు అన్ని విధాలుగా అర్హులు అని వ్యాఖ్యానించారు.
కాగా... పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి... భారత్ పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ - 3 సక్సెస్ పట్ల ఆయన భారతదేశంపై ప్రశంసల జల్లులు కురిపించారు!