170 వార్ హెడ్లు.. అన్న పానీయాలు లేవు కానీ.. అణ్వస్త్రాలు కావాలట
1998లో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షల అనంతరం భారత్ తో పోటీపడుతూ ఆ వెంటనే అణు పరీక్షలు చేసింది పాకిస్థాన్
By: Tupaki Desk | 15 Sep 2023 1:30 PM GMTరోజంతా కరెంటు ఉంటుందో లేదో తెలియదు.. గోధుమ పిండికీ దిక్కులేదు.. ఖజానాలో నాలుగు పైసల్లేవు.. గట్టిగా వరదలొస్తే నిలుస్తుందో లేదో తెలియదు.. కానీ, అణ్వస్త్రాలు మాత్రం కావాలట.. అదేదో సామెత చెప్పినట్లుంది పాకిస్థాన్ పరిస్థితి. ఇప్పుడా దేశం వద్ద 170 అణు వార్ హెడ్లు ఉన్నాయంటే నమ్మగలరా? కేవలం రెండేళ్లలో వాటి సంఖ్య 200 దాటడం ఖాయమట. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఒకప్పటి ఆప్త మిత్రుడు అమెరికానే తెలిపింది. అసలు పాక్ ను అణ్వస్త్రాల దిశగా ఉసిగొలిపిందే అగ్ర రాజ్యం. అలాంటి అమెరికానే నేడు పాక్ వద్ద ఉన్న అణ్వస్త్రాలను చూసి నోరెళ్లబెట్టింది. దీన్నిబట్టి పాక్ ఏ దిశగా పయనిస్తోందో అర్థమవుతోంది.
60-80 అనుకుంటే.. 170
1998లో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షల అనంతరం భారత్ తో పోటీపడుతూ ఆ వెంటనే అణు పరీక్షలు చేసింది పాకిస్థాన్. తద్వారా తానూ అణ్వస్త్ర దేశంగా అవతరించింది. అలా అలా పాతికేళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి. కాగా, 2020 నాటికి 60 నుంచి 80 వరకూ పాకిస్థాన్ వద్ద అణు వార్ హెడ్లు ఉంటాయని అమెరికా అనుకుందట. కానీ, అవిప్పుడు 170కి చేరాయని అమెరికా అణ్వస్త్ర శాస్త్రవేత్తలు తమ న్లూక్లియర్ నోట్ బుక్‌లో వారు తెలిపారు.
అటు అప్పులు.. ఇటు అణ్వస్త్రాలు..
విపరీతమైన ఆర్థిక అస్థిరత, తీవ్ర ద్రవ్యోల్బణం, ఆపై ప్రభుత్వంపై ప్రజాగ్రహం.. నిత్యం అప్పు కోసం చైనా, గల్ఫ్ దేశాలను అడుక్కునే పాకిస్థాన్ వద్ద ఇన్ని అణ్వస్త్రాలు ఉండడం ప్రపంచాన్ని నివ్వెరపరిచే అంశమే. అంతెందుకు..? ఉద్దీపన ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అడ్డగోలు నిబంధనలనూ పాక్ ఒప్పుకొంది. కానీ, భారత్ ను చూసో.. లేక భయపడో అణు డాంబికం మాత్రం వదలడం లేదు. అణ్వాయుధాలను పెంచుకోవాలనే యావ తగ్గడం లేదు. వార్ హెడ్లతో అణ్వాయుధ శక్తిని క్రమంగా పెంచుకుంటోందని.. అణ్వాయుధాలకు కావాల్సిన శుద్ధి చేసిన యురేనియం, ప్లుటోనియం వంటి ఫిసిల్ మెటీరియల్ ఉత్పత్తి పరిశ్రమ పాక్ లో పెరుగుతోంది.
ఏటా 14 నుంచి 27 తయారీ..
పాకిస్థాన్ ఏటా 14 నుంచి 27 అణు వార్‌హెడ్లు తయారుచేస్తోందట. శుద్ధిచేసిన యురేనియం, ప్లుటోనియం ఉత్పత్తి తీరును బట్టి అమెరికా శాస్త్రవేత్తలు ఆ నిర్ణయానికి వచ్చారు. కాగా, పాకిస్థాన్ సైనిక, వైమానిక స్థావరాల వద్ద నిర్మాణాలకు సంబంధించిన ఉపగ్రహాలు పంపిన ఫొటోలను విశ్లేషించి అమెరికా ఈ నివేదిక తయారుచేసింది.