బుద్ది మారదు: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు వేళ.. పాక్ కారుకూతలు
దేశం నుంచి విడిపోయి.. లక్షలాది ప్రాణాలు పోయేలా చేసిన పాకిస్థాన్ కు.. ఆ తర్వాత కూడా బుద్ది రాలేదు. మనసు మారలేదు.
By: Tupaki Desk | 12 Dec 2023 5:18 AM GMTదేశం నుంచి విడిపోయి.. లక్షలాది ప్రాణాలు పోయేలా చేసిన పాకిస్థాన్ కు.. ఆ తర్వాత కూడా బుద్ది రాలేదు. మనసు మారలేదు. హింసతో పుట్టిన ఆ దేశం.. అదే హింసను నమ్ముకున్నదే తప్పించి.. దేశ ప్రజల గురించి ఆలోచించింది లేదు. తాము పాలించేది మనుషుల్ని కాదు గొర్రెలను అనుకునే ఆ పాలకులకు తగ్గట్లే.. తమ దేశం నూరిపోసే ప్రతీకారాన్నివంట పట్టించుకోని దేశాన్ని అధోగతి పాలు చేసుకున్న పాక్ ప్రజలకు.. ఈ డిజిటల్ ప్రపంచంలోనూ వారి ఆలోచనలు మారలేదు. పాలకులు మారలేదు. ఇప్పటికి భారత్ మీద నిత్యం పడి ఏడ్చే పాకిస్థాన్.. తాజాగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టఇచ్చిన తీర్పు నేపథ్యంలో పాకిస్థాన్ స్పందించింది. అంచనాలకు తగ్గట్లే కారుకూతలు కూసింది.
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ఆ మధ్యన మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. దీనిపై విపక్ష పార్టీలు కొన్ని తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం.. తాజాగా తీర్పును ఇస్తూ.. ఆర్టికల్ 370 రద్దును సమర్థించటమే కాదు.. ఆ నిర్ణయంపై తాము కలుగజేసుకోమని స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో ఏ పాయింట్ ను విమర్శించలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంలో ఇసుమంత కూడా తప్పులేదన్న విషయాన్ని తాజా తీర్పుతో స్పష్టం చేసిందని చెప్పాలి.
ఇలాంటివేళ.. పాకిస్థాన్ స్పందించింది. సుప్రీం తీర్పుపై ఆ దేశం తన అక్కసును వెళ్లగక్కింది. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు చట్టపరమైన విలువ లేదంటూ కారుకూతలు కూసింది. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏకపక్షమని.. వాటిని అంతర్జాతీయ చట్టాలు గుర్తించలేవంటూ అర్థం లేని మాటల్ని మాట్లాడేసిన పాక్ తీరు చూస్తే.. ఆ దేశం ఎప్పటికి మారదన్న విషయం మరోసారి స్పష్టమవుతుంది.
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రభుత్వ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా తప్పు పట్టారు. ఆర్టికల్ 370 రద్దుపై భారత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను అతర్జాతీయ చట్టం గుర్తించలేదని.. దీన్ని సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అంతర్జాతీయంగా చట్టపరమైన విలువ లేదని మండిపడ్డారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్ణయాలకు అనుగుణంగా కశ్మీరీలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయన్న పాక్ విదేశాంగ మంత్రికి తగ్గట్లే.. పాక్ మాజీ ప్రధాని.. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షుడు కూడా సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టారు. అంచనాలకు తగ్గట్లే కారుకూతలు కూశాడు. అది పక్షపాత నిర్ణయమేనంటూ అక్కసు వెళ్లగక్కడాడు. కశ్మీరీ హక్కుల కోసం అన్ని స్థాయిల్లో పోరాడతామని పేర్కొనటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు పాక్ అక్రమిత కశ్మీర్ విషయంలో మోడీ సర్కారు మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది స్పష్టమవుతుంది.