Begin typing your search above and press return to search.

రోటీన్ కు భిన్నంగా పాక్ ప్రధానికి లవ్ గురు ఇమేజ్.. అదెలా?

సైన్యం కనుసన్నల్లో చిక్కుకుపోయిన పాకిస్థాన్ కు ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎంపిక కావటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Jan 2024 6:17 AM GMT
రోటీన్ కు భిన్నంగా పాక్ ప్రధానికి లవ్ గురు ఇమేజ్.. అదెలా?
X

సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ.. దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాని ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది పాకిస్థాన్. ఓవైపు దారుణ ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు తీవ్రవాదం.. అన్నింటికి మించి నిత్యం భారత్ మీద పడి ఏడ్చే ధోరణి. తాము బాగుపడాలనుకునే దాని కంటే.. భారతదేశం నాశనం అయిపోతే బాగుండన్న ఆలోచనలే పాకిస్థాన్ కు పెద్ద శాపంగా చెప్పాలి. తరచూ రాజకీయ సంక్షోభంతో కిందా మీదా పడుతూ.. సుస్థిరమైన పాలన అన్నది లేని పరిస్థితి.

సైన్యం కనుసన్నల్లో చిక్కుకుపోయిన పాకిస్థాన్ కు ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎంపిక కావటం తెలిసిందే. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ దేశంలో అతి త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి వేళ.. జనవరి 1 సందర్భంగా పాక్ ప్రధానిగా వ్యవహరిస్తున్ అన్వర్ దేశ ప్రజలు అడిగినప్రజలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఆయనకు సరికొత్త ఇమేజ్ ను తీసుకురావటమే కాదు.. గతంలో ఈ తరహా ప్రధానమంత్రిని చూడలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

జనవరి ఒకటి సందర్భంగా ఆయన ఆన్ లైన్ వేదికగా దేశ ప్రజలు అడిగినప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు ఆయన ఇచ్చిన క్రేజీ సమాధానాలతో ఇప్పుడాయన లవ్ గురు ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. కొందరు అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు అంతే విచిత్రంగా ఇచ్చిన సమాధానాలతో ఆయన్ను మరిన్నిప్రశ్నలు అదే కోవలో ఉండేలా రావటం గమనార్హం.

ఒక వ్యక్తికి 52 ఏళ్లు వచ్చినప్పటికి తనకు నచ్చిన మహిళను వివామాడొచ్చా? అని ప్రశ్నించగా పాక్ ప్రధాని హోదాలో ఉన్న అన్వర్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ‘‘52 కాదు 82 ఏళ్లు వచ్చినా నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు’’ అని బదులిచ్చారు. అదే సమయంలో మరొకరు ఇంకో ప్రశ్నను సంధించారు. డబ్బులు లేనప్పటికీ ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏం చేయాలన్న సందేహానికి బదులిస్తూ.. ‘నా జీవితంలో ఎవరినీ ఆకట్టుకోవటానికి ప్రయత్నించలేదు. కానీ.. చాలామందిని ఆకట్టుకున్నాను’ అని పేర్కొన్నారు.

విదేశాల్లో జాబ్ వచ్చి ప్రేమను వదులుకోవాల్సి వస్తే ఏం చేయాలన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘అనుకోకుండా ప్రేమను పొందొచ్చు. మీ సామర్థ్యానికి అనుగుణంగా జాబ్ పొందారని అనుకుంటున్నా. అవకాశాన్ని వదులుకోవద్దు’’ అంటూ ప్రేమ వైపే మొగ్గు చూపటం విశేషంగా చెప్పాలి. సరైన అత్తగారు లేకపోతే ఏం చేయాలన్న ప్రశ్నకు ఆయన క్రేజీ సమాధానం ఇచ్చారు. ‘డిజాస్టర్ మేనేజ్ మెంట్ కోర్సు చేయాలి’ అంటూ ఫన్నీగా బదులిచ్చారు. మొత్తంగా తన సమాధానాలతో పాకిస్థాన్ ప్రజలనే కాదు..ఇప్పుడు చాలామందిని ఆకట్టుకుంటున్నారని చెప్పక తప్పదు.