పబ్ జీ ప్రేమకథ.. పాక్ మహిళ సోదరుడు ఆర్మీ..?
ఇందులో భాగంగా... ఆమె సోదరుడు పాకిస్థాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 20 July 2023 5:44 AM GMTపబ్ జీ ద్వారా ఓ భారతీయుడితో పరిచయం పెంచుకొని, ప్రేమలో పడిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ సంగతి తెలిసిందే. ప్రియుడిని కలుసుకోవడం కోసమని, కలిసి బ్రతకడం కోసమని పాక్ లో ఆస్తులు అమ్ముకుని మరీ ఇండియాకు వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న ఆమె గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తుంది.
అవును... ప్రియుడి కోసమంటూ తన భర్తను విడిచి, నలుగురు పిల్లలతో కలిసి ఇండియా చేరుకున్న పాకిస్థానీ మహిళ, సీమా హైదర్ ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆమె చెబుతున్న మాటలు, చూపిస్తున్న డాక్యుమెంట్లు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... ఆమె సోదరుడు పాకిస్థాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది.
సీమా హైదర్ పోలీస్ విచారణలో ఎలాంటి బెరుకు లేకుండా సమాధానాలు చెబుతుందంట. సాదారణంగా పోలీస్ విచారణలో చాలామందిలో కనిపించే సహజమైన బెరుకు కూడా ఆమెకు లేదని అంటున్నారట. దీంతో మరింతగా పోలీసులు అనుమానం పెరిగిందని తెలుస్తుంది. కారణం... ఐ.ఎస్ఐ. శిక్షణలో బెరుకు లేకుండా, తడుముకోకుండా సమాధానాలు చెప్పడం కూడా ఒక భాగం కావడమే!
ఇదే సమయంలో ఆమె చూపిస్తున్న డాక్యుమెంట్లు కూడా మరికొన్ని అనుమానాలాను రేకెత్తిస్తున్నాయని అంటున్నారు. కారణం... ఆమె గుర్తింపు కార్డును 2022లో పొందారని తెలుస్తుంది. సాధారణంగా పాక్ లో పుట్టగానే గుర్తింపు కార్డు ఇస్తారు. కానీ ఈమె చూపిస్తున్న కార్డు... ఏడాది క్రితం తీసుకున్నది కావడం గమనార్హం. దీంతో పాటు ఆమె పిల్లల కార్డుల్ని కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.
ఇవన్నీ ఒకెత్తు అయితే... మరో కీలకమైన విషయాన్ని సీమ దాచినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆమెకు వరుసకు సోదరుడైన ఒక వ్యక్తి పాకిస్థాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడంట. అయితే ఈ విషయాన్ని సీమ కవాలనే దాచిపెట్టి ఉండొచ్చని, ఈమెకు పాక్ ఆర్మీకీ సంబంధం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో కేవలం 5వ తరగతివరకూ మాత్రమే చదువుకున్న సీమ... గతంలో ఎక్కడకూ వెళ్లినట్లు కనిపించని సీమ... నలుగురు పిల్లలను వెంటపెట్టుకుని పాక్ నుంచి దుబాయ్ కు వెళ్లి, అట్నుంచి అటు నేపాల్ కు వచ్చి, నేపాల్ నుంచి ఇండియాలోకి ప్రవేశించడం మామూలు విషయం కాదని అంటున్నారంట పోలీసులు. దీంతో... ఈమెకు ఎవరో సాయం చేసి ఉంటారని అనుమానిస్తున్నారంట. దీంతో... ఖాట్మాండు హోటల్ లో సీమ-సచిన్ బస చేసిన హోటల్ పై కూడా భారత నిఘావర్గాలు దృష్టి పెట్టాయని తెలుస్తుంది.
ఇదే సమయంలో ఆమె పబ్ జీ అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు ఆమె నిరాకరిస్తుందని తెలుస్తుంది. దీంతో పోలీసుల అనుమానం మరింత పెరిగిందని అంటున్నారు. కారణం... పబ్ జీ ద్వారానే చాలామంది ఉగ్రవాదులు సమాచారాన్ని పరస్పరం పంపించుకుంటున్నారనే సమాచారం పోలీసుల వద్ద ఉందట.
దీంతో ఆమెను వెనక్కి పంపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అయితే పోలీసులు అనుమానిస్తున్నట్లు ఆమె పాక్ ఏజెంటా.. ఉగ్రవాదా.. లేక, నిజంగానే ప్రియుడి కోసం పాక్ నుంచి వచ్చేసిందా అనేది తెలిసిన తర్వాతే ఒక నిర్ణయానికి రావొచ్చని తెలుస్తుంది. ఈ సమయంలో అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన కారణంగా అయినా.. ఆమెను తిరిగి పాక్ కి పంపే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు!!
కాగా... కేవలం ప్రేమ కోసమే తను ఈ సాహసం చేశానని, తన కేసును మానవతా దృక్పథంతో చూడాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే!