పాలేరు దంగల్.. ఓటర్లపై నోట్ల వర్షం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో కీలక నాయకులు పోటీ చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది
By: Tupaki Desk | 26 Nov 2023 3:53 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో కీలక నాయకులు పోటీ చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఒకటి రెండు నియోజకవర్గాలు మరింత కాక పుట్టిస్తున్నాయి. దీనికి కారణం.. ప్రత్యర్థులు కోట్లకు పడగలెత్తిన వారు కావడం. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కావడమే! ముఖ్యంగా ఎటు చూసినా.. పాలేరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది చర్చగా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీలో ఉన్న ఇద్దరు నాయకులు కూడా.. కోట్లకు పడగ లెత్తిన వారే. ఇద్దరూ పారిశ్రామిక వేత్తలే. అయితే.. ఒకరు మీడియాలో నిత్యం ఉంటే.. మరొకరు సైలెంట్‌గా ఉంటారు అంతే తేడా! డబ్బుల పరంగా చూసుకుంటే.. ఎవరూ ఎవరికీ తీసిపోరు. నువ్వు కోటి తీస్తే.. నేను కోటిన్నర తీస్తా అనే టైపులో నాయకులు పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. కందాళ వ్యవహారానికి వస్తే.. ఆయన గత 2018 ఎన్నికల్లో ఏకంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఓడించి పేరు తెచ్చుకున్నారు. అది ఆయనకు తొలి పోటీ కావడం గమనార్హం. అయితే.. ఆ ఎన్నికల్లోనే ఆయన విజృంభించారు. ఆ తర్వాత బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు కూడా కందాలకు కలిసి వస్తున్నారు.
ఇక, పొంగులేటి.. వైసీపీ నుంచి బీఆర్ ఎస్.. తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని పొంగులేటి నిర్ణయించుకున్న దరిమిలా.. మండలాల వారీగా .. నోట్ల కట్టలు పరుగులు పెడుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ఎవరు ఎవరికి ఇస్తున్నారో తెలియదు. కానీ, నోట్ల పంపకాలు మాత్రం జరుగుతున్నాయని చెబుతున్నారు. అదేసమయంలో కందాల కూడా.. పంపకాలు షురూ చేశారని అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు దిగ్గజ ధన వంతుల పోటీలో ప్రజలపై నోట్ల వర్షం కురుస్తుండడం గమనార్హమని అంటున్నారు పరిశీలకులు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.