Begin typing your search above and press return to search.

పేరుకు "పాలేరు".. తెలంగాణలోనే అతి పెద్ద పోరు!

కాగా, ఖమ్మం, కొత్తగూడెం పోగా కంటే ఈసారి పాలేరులో పోటీ రసవత్తరంగా మారింది. "పాలేరు" అని పేరున్నప్పటికీ పోటీ మాత్రం బహుముఖంగానే ఉండనుంది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 8:40 AM GMT
పేరుకు పాలేరు.. తెలంగాణలోనే అతి పెద్ద పోరు!
X

తెలంగాణలో అగ్ర నేతలు పోటీ పడుతున్న నియోజకవర్గం ఏది..? అత్యంత ఖర్చు జరిగే సీటు ఏది..? పొత్తుల్లో భాగంగా నలుగుతున్న స్థానం ఏది..? ఒకే పార్టీలో నలుగురు టికెట్ ఆశావహులు ఉన్న నియోజకవర్గం ఏది..? వీటన్నిటికీ ఒకటే నియోజకవర్గం పేరు చెప్పక తప్పదేమో..? ఉమ్మడి ఖమ్మం మిగతా తెలంగాణతో పోలిస్తే రాజకీయ, భౌగోళిక, సామాజిక పరంగా భిన్నమైనది. దీనికితగ్గట్లే అక్కడ అన్ని పార్టీలకూ ఆదరణ ఉంటుంది. బహుశా రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేని పార్టీలు ఖమ్మంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో? ఉమ్మడి ఖమ్మంలో మూడే జనరల్ నియోజకవర్గాలున్నాయి. ఓసీ, బీసీ నాయకులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలంటే వీటినే ఎంచుకోవాలి. కాగా, ఖమ్మం, కొత్తగూడెం పోగా కంటే ఈసారి పాలేరులో పోటీ రసవత్తరంగా మారింది. "పాలేరు" అని పేరున్నప్పటికీ పోటీ మాత్రం బహుముఖంగానే ఉండనుంది.

పొంగులేటి, తుమ్మల, షర్మిల ఎన్నికల్లో పోటీకి తెలంగాణలో ఔత్సాహిక అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 1,006 దరఖాస్తులు రాగా.. పాలేరు నుంచి 15 మంది దరఖాస్తు చేశారు. ఇల్లందు (38) తర్వాత ఉమ్మడి ఖమ్మంలో అత్యధిక దరఖాస్తులు వచ్చింది ఈ నియోజకవర్గం నుంచే.

అయితే, ఇదంతా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ లో చేరకముందు. ఇక జూలైలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరారు. వీరిద్దరిలో పొంగులేటి మూడు జనరల్ స్థానాలకూ దరఖాస్తు చేసుకోగా, తుమ్మల ఇటీవల కాంగ్రెస్ లో చేరడంతో దరఖాస్తుకు అవకాశం లేకపోయింది. ఇక వైఎస్సార్టీపీ అంటూ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల పాలేరు బరిలో నిలుస్తానని హడావుడి చేసిన సంగతి తెలిసిందే.

చివరకు దక్కేదెవరికో? కాంగ్రెస్ పార్టీలోనే పాలేరు టికెట్ వ్యవహారం అత్యంత సంక్లిష్టంగా మారింది. తుమ్మల పాలేరు నుంచే పోటీ చేసి తీరతానని ఖమ్మం వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. షర్మిల సైతం పాలేరు మీద పట్టు వీడడం లేదు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు "పాలేరు"ను ఆమె ముందు పెడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఒక్క కాంగ్రెస్ లోనే వీరు ముగ్గురూ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. వీరే కాక మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు, పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి కూడా పాలేరులో పోటీకి ఉత్సాహం చూపుతున్నారు. రాష్ట్ర పార్టీ అగ్ర నేత కోటాలో పాలేరు టికెట్ కు పట్టుబడుతున్నట్లు సమాచారం.

పొత్తులో పోతే..? కాంగ్రెస్ తరఫునే ఇంతమంది పోటీకి ఉండగా.. పొత్తులో భాగంగా పాలేరు సీటును కోరుతోంది సీపీఎం. సమీకరణాల్లో భాగంగా ఈ సీటు సీపీఎంకు వెళ్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా ఉంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత నియోజకవర్గం పాలేరు.

వామపక్షాలతో కాంగ్రెస్ కు పొత్తు గనుక కుదిరితే ఆయన ఈ సీటు నుంచి బరిలో నిలుస్తారనే నిస్సందేహం. మరి ఇన్ని సంక్లిష్టతల మధ్య ఎవరికో ఒకరికి కాంగ్రెస్ టికెట్ దక్కితే మిగతావారు గెలుపునకు సహకరిస్తారా? అనేది చూడాలి.

బీఆర్ఎస్ కందాళ, బీఎస్పీ అల్లిక పాలేరులో బీఆర్ఎస్ టికెట్ సిటింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికే దక్కింది. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయినప్పటికీ తుమ్మలను కాదని కందాళకు టికెట్ ఇచ్చారు. దీంతోనే తుమ్మల బీఆర్ఎస్ ను వీడారు. మరోవైపు బీఎస్పీ తరఫున అల్లిక వెంకటేశ్వరరావు యాదవ్ పోటీపడుతున్నారు. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ సామాజికవర్గం ఓట్లే పాలేరులో 65 వేల వరకు ఉన్నాయి. అంటే.. పాలేరులో అసెంబ్లీ ఎన్నికల పోరు అత్యంత రక్తికట్టనుందన్నమాట.