ఇజ్రాయెల్-హమాస్: అమెరికాలో ఆరేళ్ల బాలుడిని కిరాతకంగా చంపిన వృద్ధుడు!
ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విడుస్తున్న భారీ బాంబుల ధాటికి పెద్ద పెద్ద భవంతులు సైతం కుప్పకూలుతున్నాయి
By: Tupaki Desk | 17 Oct 2023 5:57 AM GMTతమ దేశంపైకి హమాస్ ఉగ్రవాదులు 5 వేలకు పైగా రాకెట్ దాడులతో విరుచుకుపడి వందలాది మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవ్వడంతో వారిపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులకు దిగిన సంగతి తెలిసిందే. భూతలం, గగనతలం, సముద్ర తలం ఇలా అన్ని వైపులా గాజాను చుట్టుముట్టి భీకర యుద్ధం చేస్తోంది. దీంతో మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది.
ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విడుస్తున్న భారీ బాంబుల ధాటికి పెద్ద పెద్ద భవంతులు సైతం కుప్పకూలుతున్నాయి. దీంతో భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు 1400 మంది ఇజ్రాయెల్ కు చెందిన పౌరులు, సైనికులు మృతి చెందారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో 2,670 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 10 వేల మంది పాలస్తీనియన్లు తీవ్రంగా గాయపడ్డారు.
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం అగ్రరాజ్యం అమెరికా వరకు పాకింది. 6 ఏళ్ల ముస్లిం చిన్నారి ప్రాణాలను తీయడానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో 71 ఏళ్ల వృద్ధుడు ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. అతడు 32 ఏళ్ల చిన్నారి తల్లిని కూడా కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. వృద్ధుడి దాడిలో 6 ఏళ్ల చిన్నారి కన్నుమూశాడు. చిన్నారి తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
నిందితుడు జోసెఫ్ ఎం కజుబాను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముస్లిం వ్యతిరేక మనస్తత్వం కారణంగానే వృద్ధుడు చిన్నారిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.
అమెరికా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు జోసెఫ్ ఎం కజుబా ప్లెయిన్ ఫీల్డ్ టౌన్ షిప్ లో ఉంటున్నాడు. అక్కడే నివసిస్తున్న పాలస్తీనా– అమెరికన్ అయిన ఆరేళ్ల చిన్నారి వాడియా అల్–ఫయూమ్.. ఆమె తల్లిపై కత్తులతో దాడికి దిగాడు.
వృద్ధుడి దాడిలో బాలుడికి 26 కత్తిపోట్లు పడ్డాయి. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. నిందితుడు జోసెఫ్.. ఆ బాలుడి తల్లిపై కూడా పలుమార్లు కత్తితో దాడి చేయడంతో ఆమె చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
కాగా ఇజ్రాయెల్.. హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ముస్లిం దేశాల ప్రతిస్పందనతో కొందరు వారిని లక్ష్యంగా చేసుకుని ఉంటారని భావిస్తున్నట్టు అమెరికా పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరిన్ని చోట్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తమయ్యారు.