Begin typing your search above and press return to search.

టీడీపీ తో తులసిబాబుకు సంబంధం లేదు : ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా

దీంతో రఘురామపై దాడి చేసిన నిందితుడితో టీడీపీకి సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   28 Jan 2025 9:38 AM GMT
టీడీపీ తో తులసిబాబుకు సంబంధం లేదు : ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా
X

డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు కామేపల్లి తులసిబాబుతో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న తులసిబాబు.. గుడివాడలో షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు టీడీపీ ఎమ్మెల్యే రాము సహకరిస్తున్నారని, పార్టీ కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రఘురామ క్రిష్ణం రాజు రెండు రోజు క్రితం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధ్యక్షుడు పల్లా వివరణ ఇచ్చారు.

2021లో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామరాజుపై పోలీసు కస్టడీలోనే దాడి జరిగిందని, ఆయనను హతమార్చేందుకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం రాగానే బాధితుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయపాల్ తోపాటు సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న తులసిబాబును అరెస్టు చేశారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న తులసిబాబుకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకరిస్తున్నారని రఘురామ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తులసిబాబు గుడివాడలో ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేగా కథ నడుపుతున్నారని కూడా రఘురామ విమర్శలు గుప్పించారు.

దీంతో రఘురామపై దాడి చేసిన నిందితుడితో టీడీపీకి సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పార్టీ ప్రతిష్ఠకు మాయని మచ్చగా మారుతుండటంతో టీడీపీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. రఘురామపై దాడి చేసిన నిందితుడు తులసిబాబుతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే జనవరి 8న తులసిబాబు అరెస్టు సందర్భంగా ఆయన అనుచరులుగా చెబుతున్న గుడివాడ టీడీపీ కార్యకర్తలు తులసిదళం పేరుతో హడావుడి చేశారు.

రఘురామ కేసు టీడీపీకి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. గత ప్రభుత్వంలో ఎన్నో అరచకాలు జరిగాయని ఆరోపిస్తున్న టీడీపీ.. అందుకు రఘురామపై కస్టోడియల్ టార్చరును ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇలాంటి కేసులో టీడీపీ నేతగా ప్రచారం చేసుకుంటున్న కామేపల్లి తులసిబాబుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడం, అతడి కోసం గుడివాడ పార్టీ శ్రేణులు ధర్నాలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పార్టీ హైకమాండ్ పార్టీతో తులసిబాబుకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది.