టీబీజేపీకి మరో దెబ్బేసిన గులాబీ బాస్!
అందుకు భిన్నంగా ఇప్పుడు టీబీజేపీకి చెందిన పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. ఇదో సిత్రమైన పరిణామంగా చెబుతున్నారు
By: Tupaki Desk | 3 Nov 2023 4:19 AM GMTఒకటి తర్వాత ఒకటి చొప్పున తెలంగాణ బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ మధ్యన తెలంగాణలో బీజేపీకి తిరుగులేదని.. అధికార బీఆర్ఎస్ కు అసలుసిసలు ప్రత్యామ్నాయం బీజేపీనేనన్న అభిప్రాయం బలంగా వినిపించేది. ఎప్పుడైతే రాష్ట్ర పార్టీ సారధ్యాన్ని బండి సంజయ్ చేతుల్లో నుంచి తీసేసుకున్నారో.. అప్పటి నుంచి ఆ పార్టీ డౌన్ ఫాల్ మొదలైందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మిగిలిన రాజకీయ పార్టీలతో చూసినప్పుడు బీజేపీలో నుంచి ఇతర పార్టీలోకి వలసలు వెళ్లటం చాలా తక్కువగా కనిపిస్తుంది.
అందుకు భిన్నంగా ఇప్పుడు టీబీజేపీకి చెందిన పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. ఇదో సిత్రమైన పరిణామంగా చెబుతున్నారు. రాజకీయ పార్టీలకు వలసలతో ఎదురుదెబ్బలు కామనే అయినప్పటికి ఈ స్థాయిలో పార్టీ మారటం మాత్రం తెలంగాణ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గెలుపు అవకాశాలు పరిమితంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. మిగిలిన పార్టీలకు భిన్నంగా అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా మూడో జాబితా విడుదల చేయటం.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించటం తెలిసిందే.
కీలకమైన కొన్ని స్థానాల్ని ఇప్పటికి పెండింగ్ పెట్టటం ద్వారా.. ఉత్సుకతను పెంచేస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఖైరతాబాద్ టికెట్ ను ఆశించి భంగపడిన సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ రాజీనామా చేయటం పార్టీలో కలకలాన్ని రేపుతోంది. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ నేత.. పార్టీకి రాజీనామా చేయటం టీబీజేపీకి పెద్ద షాక్ గా చెబుతున్నారు. కమలానికి కటీఫ్ చెప్పిన గోవర్ధన్.. గులాబీ కారు ఎక్కేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు తగ్గట్లే.. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే.. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్.. హరీశ్ లు గోవర్ధన్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.
సంఘ్ పరివార్ తోనూ.. బీజేపీతోనూ దాదాపు 22 ఏళ్ల అనుబంధం ఉన్న గోవర్ధన్.. బీజేపీకి గుడ్ బై చెప్పటంతో.. ఖైరతాబాద్ లో పార్టీ ఖాళీ అయినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల్లో నాలుగైదు సీట్లు గెలిచేందుకు బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బలహీన వర్గాలను పార్టీ నాయకత్వం మోసం చేస్తోందంటూ ఆరోపించిన అతను.. మరింత ఘాటుగా రియాక్టు అవుతున్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇక బీజేపీలో ఉండటం ఆత్మహత్యతో సమానమని.. అగ్రకులాల చేతిలో బీజేపీ బందీ అయినట్లుగా మండిపడుతున్నారు. మిగిలిన వేళలో ఫర్లేదు కానీ.. కీలకమైన ఎన్నికల వేళ.. ఈ తరహా వ్యాఖ్యలు పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.