Begin typing your search above and press return to search.

ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కలు... బీఆరెస్స్ కు కొత్త తిప్పలు!

ఈ క్రమంలో తాజాగా కుక్కలను పిల్లులుగా మార్చడమే ఆపరేషన్ ఆకర్ష అసలు ఉద్దేశ్యం అన్నట్లుగా బీఆరెస్స్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు

By:  Tupaki Desk   |   27 Aug 2023 8:08 AM GMT
ఆ కాంగ్రెస్  ఎమ్మెల్యేలు కుక్కలు... బీఆరెస్స్  కు కొత్త తిప్పలు!
X

పార్టీ ఫిరాయింపు అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనేది తెలిసిన విషయమే. పైగా ఫిరాయింపుదారులు పైకి నిస్సిగ్గుగా వ్యవహరించినా... ప్రజల్లో మాత్రం వారిపై ఏహ్య భావం ఉంటుందని అంటుంటారు! ఈ క్రమంలో తాజాగా కుక్కలను పిల్లులుగా మార్చడమే ఆపరేషన్ ఆకర్ష అసలు ఉద్దేశ్యం అన్నట్లుగా బీఆరెస్స్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెస్తాయని అంటున్నారు పరిశీలకులు!

అవును... "బీఆరెస్స్ లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కుక్కలు. అటువైపు ఉంటే మొరుగుతారనే బీఆరెస్స్ లో చేర్చుకొని దొడ్లో కట్టేశారు. అటువైపు ఉన్న కుక్కలను ఇటు తీసుకుని.. వారిని పిల్లిలాగా కేసీఆర్‌ మార్చేశారు. అలా కేసీఆర్‌ వారిని గీత దాటకుండా చేసేశారు" అంటూ బీఆరెస్స్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దీంతో ఈ వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని పల్లాను డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ నాడు తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, ఇన్ బ్యాలెన్స్ ఉండేందుకే తప్ప కుక్కల్ని చేయడానికి కాదని విషయాన్ని గమనించాలని సూచించారు.

బలుపెక్కువై డబ్బు ఎక్కువ ఉన్నవారు అమాయక ప్రజల మీద డబ్బులు చల్లి అయోమయానికి గురి చేస్తున్నారని.. అలా చేయడం సీఎం కేసీఆర్ సంకల్పానికి విరుద్ధం అని ముత్తిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు బీఆరెస్స్ లో పెనుదుమారమే రేపుతున్నాయి.

బీఆరెస్స్ ఎమ్మెల్సీ చేసిన ఈ వ్యాఖ్యలు.. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఆ పార్టీలో చేరిన శాసనసభ్యులు, ఇతర నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో బీఆరెస్స్ అవకాశాలు దెబ్బతింటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా.. ఈసారి ఏ పార్టీఇకి పూర్తిస్థాయి మెజారిటీ రాదని చెబుతున్న తరుణంలో... ఫిరాయింపుదారుల పాత్ర కీలకం కాబోతుందనే చర్చా మొదలైంది.

సరిగ్గా ఈ సమయంలో పార్టీలు మారేవారు.. ఫిరాయింపుదారులు కుక్కల్లాంటి వారని.. వారిని పిల్లులుగా మార్చడానికే బీఆరెస్స్ లోకి కేసీఆర్ ఆహ్వానించారని చెప్పడం.. పార్టీకి ముందు ముందు అతిపెద్ద డ్యామేజ్ గా మారే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.

కాగా... 2018లో భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకున్న అధికార బీఆరెస్స్... కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్‌ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను, తెలుగుదేశం పార్టీ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. ఈ ఫిరాయింపులతో 119 మంది సభ్యుల అసెంబ్లీలో బీఆరెస్స్ బలం 104కి చేరుకుంది.

అయితే తాజాగా ఫిరాయింపుదారులపై బీఆరెస్స్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు అయినా... ప్రజాభిప్రాయాన్ని పక్కనపెట్టి గోడలు దూకే మనస్థత్వం ఉన్న నాయకులకు, అలాంటి ఆలోచనలు చేసే ఎమ్మెల్యేలకు కనువిప్పు కలిగించాలని అంటున్నారు పరిశీలకులు. ఇలాంటివారికి జనాల్లోనే కాదు.. గెలిపించిన పార్టీలోనే కాదు.. అనధికారికంగా చేరిన పార్టీలో కూడా విలువ ఉండదనే విషయం స్పష్టమైందని అంటున్నారు.

మరోవైపు 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు బీఆరెస్స్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని నాలుగు నియోజకవర్గాల్లో జనగాం కూడా ఉంది. ఈ స్థానానికి యాదగిరి రెడ్డి మరోసారి టిక్కెట్ ఆశిస్తుండగా.. రాజేశ్వర్ రెడ్డి కూడా ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్ తనకు ఇవ్వాలని కోరుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ తాజాగా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జనగాంలో ఆయన ఆశను నీరుగార్చే ఛాన్స్ ఉందని కొంతమంది అంటుంటే... టోటల్ బీఆరెస్స్ కు ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉందని ఇంకొంతమంది అంటున్నారు. ఇదే సమయంలో ఈ వ్యాఖ్యలు గోడలు దూకే నాయకులు నిత్యం గుర్తుంచుకోవాలని చెబుతుండటం గమనార్హం.