ఇంటివద్దే ఉన్నానంటున్న పల్లవి ప్రశాంత్... లాయర్ కీలక వ్యాఖ్యలు!
అవును... బిగ్ బాస్ రియాల్టీ షో ఫైనల్ ఫలితాల అనంతరం అన్నపూర్ణ స్టూడియో దగ్గర అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
By: Tupaki Desk | 20 Dec 2023 11:03 AM GMTబిగ్ బాస్ -7 సీజన్ సుమారు 105 రోజులపాటు సాగిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా ఆ రియాల్టీ షోలో విజేతగా పల్లవి ప్రశాంత్.. రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. ఈ సమయంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద రచ్చ రచ్చ జరగడంతోపాటు.. కృష్ణానగర్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులపై అభిమానులు దాడులకు పాల్పడ్డారు! దీనిపై టీఎస్ ఆర్టీసీ సీరియస్ అయ్యింది. దీనిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదైంది. ఈ సమయంలో విన్నర్ పల్లవి ప్రశాంత్ ఎస్కేప్ అనే వార్తలు వచ్చాయి. ఈ సమయంలో ఆయన తరుపు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... బిగ్ బాస్ రియాల్టీ షో ఫైనల్ ఫలితాల అనంతరం అన్నపూర్ణ స్టూడియో దగ్గర అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆ షోలో రన్నర్ గా నిలిచిన అమర్ దీప్, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారును అడ్డగింఛిన కొందరు ఆకతాయిలు దాడికి తెగబడ్డారు. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలపై రాళ్లు రువ్వి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో... ఈ పరిణామాలకు పల్లవి ప్రశాంత్, ఆయన అభిమానులే కారణమని అందరిపై కేసు నమోదు చేశారు.
ఈ సమయంలో ఈ విషయాలపై స్పందించిన పల్లవి ప్రశాంత్ తరుపు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పల్లవి ప్రశాంత్ పై నమోదైన కేసుకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. కాపీని పోలీసులు ఇవ్వలేదని దీంతో తాము బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదని అన్నారు. ఎఫ్.ఐ.ఆర్. కాపీ కోసం సంప్రదించగా కుటుంబ సభ్యులే రావాలని చెప్పారని ఆయన తెలిపారు. ఈ సమయంలో... తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని లాయర్ ఆరోపించడం గమనార్హం.
ఇంటి దగ్గరే పల్లవి ప్రశాంత్!:
ఆ సంగతి అలా ఉంటే... తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను పల్లవి ప్రశాంత్ ఖండించారు! ఇందులో భాగంగా తాను ఎక్కడికీ వెళ్లలేదని, ఇంటిదగ్గరే ఉన్నట్లు తెలియజేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ క్రమంలో తనవల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని కోరారు!
ఇందులో భాగంగా తాజాగా జరిగిన పరిణామాలవల్ల బిగ్ బాస్ షోలో గెలిచిన ఆనందం లేకుండా పోయిందని తన తల్లితండ్రులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సందర్భంగా... తనకు సంబంధించి ఏదైనా వీడియో తాను పెడితే నమ్మాలని.. ఇతరులు పెట్టిన వీడియోలో విషయాలను నమ్మవద్దని తెలిపారు.