అసెంబ్లీలో హాట్ సబ్జెక్ట్ అదేనా ?
తాజాగా పల్నాడు జిల్లాలోని వినుకొండలో తమ పార్టీకి చెందిన నేత మీద పాశవికంగా దాడి చేసి హత్య చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
By: Tupaki Desk | 19 July 2024 3:25 AMఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ సమావేశాలకు టీడీపీ కూటమి ప్రభుత్వం మొత్తం ప్రిపేర్ అయి వస్తోంది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరు అవుతారు అని అంటున్నారు. జగన్ వైసీపీ పక్ష నేత హోదాలోనే ఈ బడ్జెట్ సెషన్ కి అటెండ్ కానున్నారు అని అంటున్నారు.
ఈ అసెంబ్లీ సెషన్ లో హాట్ సబ్జెక్ట్ కూడా రెడీ అయింది అని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం పోలవరం, అమరావతి, ఇసుక, విద్యుత్ సహజ వనరుల మీద శ్వేత పత్రాలను వరసగా రిలీజ్ చేసింది.ఇ ఇక మిగిలిన శ్వేత పత్రాలను అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేతారు అని అంటున్నారు.
అందులో శాంతి భద్రతలు ఆర్థిక వ్యవహారాలు ఎక్సైజ్ వంటివి ఉంటాయని తెలుస్తోంది. అంటే ఇవన్నీ హాట్ సబ్జెక్టులుగా ఉంటాయని చెబుతున్నారు. శ్వేత పత్రాలు రిలీజ్ చేయడం ద్వారా గత వైసీపీ ప్రభుత్వం ఏమి చేసింది అన్నది ఎండగట్టే ప్లాన్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది.
అయితే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ క్యాడర్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ కూడా దీని మీద సీరియస్ గా ఉన్నారు. తాజాగా పల్నాడు జిల్లాలోని వినుకొండలో తమ పార్టీకి చెందిన నేత మీద పాశవికంగా దాడి చేసి హత్య చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
జగన్ సైతం వినుకొండ వెళ్ళి బాధితుల కుటుంబాన్ని పరామర్శించనున్నారు అని అంటున్నారు. దాంతో శాంతి భద్రతలు అంశం మీద శ్వేతపత్రం రిలీజ్ అయితే అటు కూటమి ప్రభుత్వం ఇటు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాడి వేడిగా చర్చ సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
జగన్ సైతం ఇవే అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారు అని అంటున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇటీవల తమ పార్టీ క్యాడర్ మీద జరిగిన దాడులను ఆయన ముందుకు పెడతారని అంటున్నారు. అలాగే ఆర్ధిక వ్యవహారాల మీద శ్వేత పత్రం కూడా మంట పుట్టించనుంది. వైసీపీ హయాంలో అప్పులు అనేక రెట్లు పెరిగాయని ఏపీని ఏమీ కాకుండా చేశారని కూటమి ప్రభుత్వం చెప్పబోతోంది.
దీనిని తిప్పికొట్టేందుకు వైసీపీ కూడా సిద్ధంగా ఉంటుంది. దాంతో ఈ అంశం సైతం అసెంబ్లీలో కాక పుట్టిస్తుందని అంటున్నారు. ఇక ఎక్సైజ్ అంశం కూడా కీలకంగా మారనుంది. మద్యం కుంభకోణం అంటూ గతంలో టీడీపీ సహా విపక్షాలు చేసిన ఆరోపణలు విమర్శించాయి.
నాసి రకం మద్యం కొత్త బ్రాండ్ల వల్ల మరణాలు పెద్ద ఎత్తున సంభవించాయన్నది కూడా శ్వేతపత్రం ద్వారా సభ దృష్టికి తెస్తారు. జగన్ సభలో ఉండగానే ఈ శ్వేత పత్రాలను రిలీజ్ చేయడం ద్వారా వైసీపీని పూర్తిగా ఇరుకున పెట్టి అయిదేళ్ళ ఆ పార్టీ నిర్వాకం గురించి జనాల ముందు పెట్టాలన్నది కూటమి ప్రభుత్వం పెద్దల ఎత్తుగడగా కనిపిస్తోంది. మరి దీనిని వైసీపీ ఎమ్మెల్యేలు ఏ మేరకు అడ్డుకుంటారు, తమ వాదనను ఏ విధంగా వినిపిస్తారు అన్నది చూడాల్సి ఉంది.
ఏది ఏమైనా తొలిసారి జరిగే పూర్తి స్థాయి బడ్జెట్ మీట్ లోనే అగ్గి రాజుకుంటుందని అంచనా వేస్తున్నారు. జగన్ సభకు హాజరు కావాలని నిర్ణయించుకోవడంతో ఈసారి సభలో వాదోపవాదాతో హై ఓలెటేజ్ తో డిస్కషన్స్ సాగుతాయని అంటున్నారు.