ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే... పల్నాడు జిల్లా వైసీపీలో వర్గపోరు!
అవును... ఇప్పటికే ఇన్ ఛార్జ్ ల మార్పు చేర్పులతో పలువురు అసంతృప్తులు రెబల్స్ గా మారి పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Feb 2024 11:30 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో అంతర్గత సమస్యలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి! ఇప్పటికే ఇన్ ఛార్జ్ ల మార్పుల వ్యవహారంతోనే పలు సమస్యలు వస్తున్నాయని అంటున్న నేపథ్యంలో... తాజాగా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. సిట్టింగ్ వర్సెస్ ఇన్ ఛార్జ్ వంటి సమస్యలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. వీటిపై జగన్ దృష్టి సారించి గాలివాన కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అవును... ఇప్పటికే ఇన్ ఛార్జ్ ల మార్పు చేర్పులతో పలువురు అసంతృప్తులు రెబల్స్ గా మారి పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పల్నాడు జిల్లాలోని వైసీపీలో వర్గపోరు తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అనే కొత్త సంస్య తరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.. ప్రత్యర్థులకు అవకాశాలు ఇచ్చేలా ఉంటున్నాయని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఇటీవలే గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. అందుకు కారణం కాసు మహేశ్ రెడ్డే అనేది స్థానికంగా వినిపిస్తున్న మాటగా చెబుతున్నారు. ఇందులో భాగంగా... జంగా కృష్ణమూర్తీ స్వగ్రామమైన దాచేపల్లి మండలం గామాలపాడులో ఆసరా చెక్కులు అందిచే కార్యక్రమాన్ని ఫిక్స్ చేశారు ఎమ్మెల్యే కాసు. ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్సీతో పాటు ఆ గ్రామ సర్పంచ్ ని లైట్ తీసుకున్నారు.
ఇందులో భాగంగా ఆ గ్రామ సర్పంచిగా ఉన్న కృష్ణమూర్తి కుమారుడు జంగా సురేష్ తో పాటు ఎమ్మెల్సీగా ఉన్న కృష్ణముర్తి ఫోటో కూడా లేకుండా ఎంపీగా పోటీ చేయనున్న అనిల్ కుమార్ యాదవ్ ఫోటోలతో ఎమ్మెల్యే కాసు బ్యానర్లు వేయించారు. దీంతో... ఆగ్రహించిన జంగా వర్గీయులు వాటిని తొలగించారు. ఈ నేపథ్యంలో... ఇరువర్గాల వారు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు జంగా కృష్ణమూర్తి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవంపై దెబ్బకొట్టి, తనను ఆవేదనకు గురిచేశారన్నారని.. తమ గ్రామంలోనూ తనకు తెలియకుండానే సమావేశాలు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. సంపాదన కోసం ఎమ్మెల్యే.. గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని ఫైరయ్యారు.
ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న అవమానాలను, అరాచకాలనూ... పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ పట్టించుకోలేదని చెబుతున్న జంగా... 2019లో గెలిచాక ఎమ్మెల్యే ఏ కార్యక్రమానికీ తనను పిలవలేదని, పైగా తనను పలకరించిన వాళ్లను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. ఇదే క్రమంలో... వైసీపీ సామాజిక న్యాయం కోసం పని చేస్తుందని చెబుతూనే.. బడుగుల మనోభావాలను గుర్తించడం లేదని చెప్పుకొచ్చారు.