టీడీపీకి గుడ్ బై చెప్పనున్న కీలక మహిళా నేత!
2009లో నెల్లూరు నుంచి బాపట్లకు వచ్చిన పనబాల లక్ష్మి అక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు
By: Tupaki Desk | 21 March 2024 8:04 AM GMTపనబాక లక్ష్మి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 1996, 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు ఎంపీ స్థానం ఆమె విజయం సాధించారు. 1999లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి విజయం సాధించారు. కేంద్రంలో 2004–09 వరకు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనబాక లక్ష్మి బాధ్యతలు చేపట్టారు.
2009లో నెల్లూరు నుంచి బాపట్లకు వచ్చిన పనబాల లక్ష్మి అక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. ఎంపీగా విజయం సాధించి మళ్లీ కేంద్రంలోని యూపీయే ప్రభుత్వంలో చేనేత, సహజవాయువు శాఖలకు సహాయ మంత్రిగా కొనసాగారు. 2014లో మరోసారి కాంగ్రెస్ తరఫున బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసిన పనబాక లక్ష్మి ఓటమి పాలయ్యారు.
2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన పనబాక లక్ష్మి తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మృతితో జరిగిన 2021 ఉప ఎన్నికలో మరోసారి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు పనబాక లక్ష్మి టికెట్ కోరగా టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదని టాక్ నడుస్తోంది. దీంతో ఆమె తన భర్త కృష్ణయ్యతో కలిసి పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త కృష్ణయ్య దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేశారు.
పనబాక లక్ష్మి, ఆమె భర్త పనబాక కృష్ణయ్య ఇద్దరూ తిరిగి తమ మాతృ పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ప్రధాన పార్టీల్లో సీట్లు రానివారికి కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కాంగ్రెస్ లో చేరారు.
ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్య కాంగ్రెస్ లో చేరొచ్చని అంటున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి బాపట్ల, తిరుపతి స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరగా ఆయన సానుకూలత వ్యక్తం చేయలేదని సమాచారం.
తన సర్వేల్లో మీకు అనుకూలంగా రాలేదని పనబాక లక్ష్మికి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. తిరుపతి, బాపట్లల్లో మీ పేరుతో నిర్వహించిన సర్వేల్లోనూ ఆశాజనక పరిస్థితులు లేవని చంద్రబాబు ఆమెకు వివరించినట్టు సమాచారం. అందువల్ల రెండు చోట్ల టికెట్లు ఇవ్వలేనని చెప్పారని అంటున్నారు.
దీంతో పనబాక లక్ష్మి తన మాతృ పార్టీ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఆమెతోపాటు ఆమె భర్త కృష్ణయ్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.