జనసేన పంచకర్లకు అనకాపల్లి బెల్లం ...?
ఆయన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో అనూహ్యంగా ఎన్నికల బరిలోకి దిగి పెందుర్తిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలను ఓడించి మరీ ఎమ్మెల్యే సీటు పట్టేశారు.
By: Tupaki Desk | 8 Sep 2023 5:30 PM GMTఆయన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో అనూహ్యంగా ఎన్నికల బరిలోకి దిగి పెందుర్తిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలను ఓడించి మరీ ఎమ్మెల్యే సీటు పట్టేశారు. ఆయనే పంచకర్ల రమేష్ బాబు. ఆయన 2014 నాటికి టీడీపీలో చేరి ఎలమంచిలి టికెట్ ని సంపాదించి అక్కడ కూడా నాన్ లోకల్ అయినా బలమైన సామాజికవర్గం అండతో రెండవసారి ఎమ్మెల్యే అయిపోయారు.
ఇక 2019లో ఆయనకు అదే సీటుని టీడీపీ ఇచ్చింది. కానీ జగన్ వేవ్ లో ఆయన ఓటమి చవి చూశారు. ఆ తరువాత 2020లో వైసీపీలో చేరారు. మూడళ్ల పాటు ఖాళీగా ఉంచేసిన పార్టీ ఆ మధ్యనే విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ ని చేసింది. ఆయన వైసీపీలో చేరడం వెనక పెందుర్తి సీటుని ఆశించడం అన్న లక్ష్యం ఉందని అంటారు. అయితే ఆ సీటుని సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకే వైసీపీ కేటాయిస్తోంది అని తెలియడంతో ఆయన ఈ మధ్యనే జనసేనలో చేరారు.
కాబోయే ఎమ్మెల్యే పంచకర్ల అంటూ ఆయన క్యాడర్ కూడా పెందుర్తిలో హడావుడి చేశారు. టికెట్ హామీ పుచ్చుకునే పంచకర్ల వైసీపీని దాటారు అని ప్రచారం అయితే సాగింది. తీరా ఇపుడు చూస్తే టీడీపీతో పొత్తు ఉంటే ఆ సీటు ఇవ్వడానికి నో చెబుతోంది అని అంటున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సొంత ఇలాకాలో జనసేనకు సీటు ఇవ్వరని అంటున్నారు. పైగా బండారు వియ్యంకుడే అచ్చెన్నాయుడు. ఇక చూస్తే బాబుకు బండారు అత్యంత సన్నిహితుడు.
దాంతో పంచకర్ల ఆశలు అలా ఆగిపోయాయని అంటున్నారు. అయితే పంచకర్లకు టీడీపీ మరో దారి చూపిస్తోంది అని అంటున్నారు. ఆ విధంగా పవన్ కి నచ్చచెప్పి ఆయనకు పోటీ చేసే చాన్స్ ఉండేలా చూస్తోంది అని అంటున్నారు. పంచకర్లకు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించే వీలుందని అంటున్నారు. అనకాపల్లి ఎంపీ సీటుని టీడీపీ ఆయన కోసమే టీడీపీ పొత్తులలో భాగంగా వదులుకోబోతోంది అని అంటున్నారు.
ఈ విషయంలో అంగీకారం కుదిరితే కనుక పంచకర్ల అనకాపల్లి ఎంపీగా పోటీకి దిగాల్సిందే అంటున్నారు. అనకాపల్లిలో బలమైన కాపు సామాజికవర్గం ఉంది. ఆ సీటులో వారు అనేక సార్లు గెలిచారు. అదే సామాజికవర్గానికి చెందిన పంచకర్లను పోటీ చేయిస్తే అది తెలుగుదేశానికి జనసేనకు కూడా లాభం అని టీడీపీ ఆలోచించే ఆయన్ని అలా షిఫ్ట్ చేయిస్తోంది అని అంటున్నారు.
మరి దీనికి పంచకర్ల ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నది చూడాలని అంటున్నారు. ఆయన విశాఖ నార్త్ నుంచి కానీ పెందుర్తి నుంచి కానీ పోటీకి సిద్ధమని అంటున్నారు. ఒకవేళ విశాఖ నార్త్ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వకుండా వేరే చోటకు షిఫ్ట్ చేస్తే ఆ సీటుని బీజేపీకి ఇస్తారు కానీ జనసేనకు ఇవ్వరని అంటున్నారు.
మొత్తానికి చూస్తే పంచకర్ల మళ్లీ విశాఖ రూరల్ జిల్లాకి బదిలీ కావాల్సిందేనా అన్నది ఆయన అనుచరుల ఆవేదనగా ఉంది అంటున్నారు. అయితే తప్పకుండా జనసేన పెందుర్తి నుంచి పోటీకి దిగుతుందని మరో వైపు ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి బెల్లానికి ప్రసిద్ధి, పంచకర్ల అక్కడికి షిఫ్ట్ అయితే కూటమికి తీపీ గెలుపూ రెండూ కలసి వస్తాయని అంటున్న వారూ ఉన్నారు మరి.