Begin typing your search above and press return to search.

పంచకర్లతో టీడీపీలో టెన్షన్

సీనియర్ నేత పంచకర్ల రమేష్

By:  Tupaki Desk   |   17 July 2023 5:58 AM GMT
పంచకర్లతో టీడీపీలో టెన్షన్
X

సీనియర్ నేత పంచకర్ల రమేష్ జనసేన పార్టీలో చేరటం ఖాయమైపోయింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయిన తర్వాత తాను జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. బహుశా 20వ తేదీన పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. అంతా బాగానే ఉంది పంచకర్ల జనసేనలో చేరుతుంటే టీడీపీలో ఎందుకు టెన్షన్. ఎందుకంటే రమేష్ రెండు నియోజకవర్గాలపైన కన్నేశారట. ఆ రెండింటిలో ఎక్కడో ఒకచోట నుండి పోటీచేయటం ఖాయమని తన మద్దతుదారులకు చెబుతున్నారట.

మరి రమేష్ గురిపెట్టిన రెండు నియోజకవర్గాల్లో ఎక్కడి నుండి పోటీచేస్తారన్నదే సస్పెన్సుగా మారిపోయింది. రమేష్ విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాలపై కన్నేశారు. 2009లో పెందుర్తి నియోజకవర్గం నుండి ప్రజారాజ్యంపార్టీ తరపున, 2014లో యలమంచిలి నుండి టీడీపీ తరపు గెలిచారు.

రాబోయే ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీచేయాలని పట్టుదలగా ఉన్నారు. పై రెండు నియోజకవర్గాల్లో పోటీచేయటం సాధ్యం కాదుకాబట్టే రమేష్ వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

జనసేనలో చేరేముందు పవన్ తో భేటీ అయినపుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారట. టీడీపీతో పొత్తుంటే పై రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి జనసేన తీసుకోవాలని, ఆ టికెట్ తనకు ఇవ్వాలని రమేష్ అడిగితే పవన్ ఓకే చెప్పారట. ఇపుడు పెందుర్తిలో మాజీమంత్రి బండారు సత్యనారాయణ యాక్టివ్ గా ఉన్నారు. అలాగే యలమంచిలిలో కూడా టీడీపీ యాక్టివ్ గానే ఉంది. కాబట్టి పొత్తులో ఏ సీటు పోతుందో అనే టెన్షన్ ఇఫుడు టీడీపీ నేతల్లో పెరిగిపోతోందట.

గ్రౌండ్ రియాలిటి ప్రకారం యలమంచిలి సీటునే చంద్రబాబునాయుడు వదులుకునే అవకాశముంది. ఎందుకంటే బండారు చాలా గట్టినేత. నియోజకవర్గంలో పట్టుండటమే కాకుండా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయాన అల్లుడు.

అంటే రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వియ్యంకుడి వరసవుతారు. రాజకీయంగా, బందుత్వాన్ని తీసుకున్నా బండారును తప్పించటం అంత తేలికకాదు. అయితే రమేష్ మాత్రం పెందుర్తిని కోరుకుంటున్నారట. మరి చివరకు ఏమవుతుందో తెలీకే తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోందని సమాచారం.