టెక్సాస్ రాష్ట్రంలో 100 అడుగుల హనుమాన్ విగ్రహం
ఒకప్పుడు అమెరికాలో హిందూ దేవాలయాన్ని నిర్మించటం.. అదో విశేషంగా చెప్పుకునేవారు.
By: Tupaki Desk | 20 Aug 2024 4:25 AM GMTఒకప్పుడు అమెరికాలో హిందూ దేవాలయాన్ని నిర్మించటం.. అదో విశేషంగా చెప్పుకునేవారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాల నిర్మాణం చోటు చేసుకోవటం.. పెద్ద ఎత్తున పూజలు జరగటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున హిందూ దేవతల విగ్రహాల్ని నిర్మిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒక ప్రాజెక్టు పూర్తైంది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో ఒక భారీ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయటమే కాదు.. దాన్ని తాజాగా భారీ ఎత్తున ప్రారంభించారు. హ్యూస్టన్ లోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో హనుమాన్ వంద అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో భారత సంస్క్రతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అంతేనా.. ఈ విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా హెలికాప్టర్ లో పూల వర్షం కురిపించారు. జై వీర హనుమాన్ నామస్మరణతో ఆ ప్రాంగణం మార్మోగింది.