Begin typing your search above and press return to search.

పంచాయితీ అధ్యక్షుడు అరుణాచలం.. రాత్రిళ్లు ఏం చేస్తారో తెలిస్తే షాకే

విన్నంతనే ఉలిక్కిపడే వేరియేషన్ ఈ ప్రజాప్రతినిధి సొంతం. ఎంతకూ జీర్ణించుకోలేనట్లుగా ఉండే ఈ పొలిటీషియన్ ఈ రోజుల్లో చాలా చాలా అరుదుగా ఉంటారు

By:  Tupaki Desk   |   21 July 2024 9:30 AM GMT
పంచాయితీ అధ్యక్షుడు అరుణాచలం.. రాత్రిళ్లు ఏం చేస్తారో తెలిస్తే షాకే
X

విన్నంతనే ఉలిక్కిపడే వేరియేషన్ ఈ ప్రజాప్రతినిధి సొంతం. ఎంతకూ జీర్ణించుకోలేనట్లుగా ఉండే ఈ పొలిటీషియన్ ఈ రోజుల్లో చాలా చాలా అరుదుగా ఉంటారు. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రతినిధిగా మారినప్పటికీ.. తాను చిన్నప్పటి నుంచి చేస్తున్న పనిని మాత్రం విడిచి పెట్టని వైనం ఆయన్ను రోటీన్ కు భిన్నంగా మార్చింది. తమిళనాడుకు చెందిన పంచాయితీ అధ్యక్షుడు అరుణాచలం ఉదంతం వెలుగు చూసి.. ఇతడి ఆదర్శాలకు ఫిదా అవుతున్నారు. ఇంతకూ అతడేం చేస్తారన్న విషయాన్ని వివరంగా చూస్తే..

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని మాత్తూర్ మాదాకోవిల్ వీధికి చెందిన అరుణాచలానికి యాభై నాలుగేళ్లు. ప్రస్తుతం ఆయన మాత్తూర్ పంచాయితీకి అధ్యక్షుడు. భార్య.. ముగ్గురు పిల్లలున్న అరుణాచలం మూడో తరగతి వరకు మాత్రమే చదివాడు. చిన్నప్పటి నుంచి తాను ఉన్న ఇంటికి దగ్గర్లో ఉన్న పరిశ్రమల్లో పని చేసేవాడు. అక్కడ సరైన పని దొరక్కపోవటంతో కూరగాయలు అమ్మేవాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు. అయినా.. శాశ్వితంగా ఆదాయం రాకపోవటంతో.. తన తాతలు చేసే శవాలు కాల్చే కాటి కాపారి పని చేసేందుకు సిద్ధమయ్యాడు. దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. 2021 డిసెంబరులో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పంచాయితీ అధ్యక్షుడిగా హోదా మారినప్పటికీ చిన్నతనం నుంచి తాను చేసే కాటికాపరి పనిని మాత్రం వదలకపోవటం గమనార్హం. ఉదయం ప్రజాప్రతినిదిగా.. రాత్రిళ్లు కాటికాపరిగా సేవలు అందిస్తుంటాడు. రోడ్ల మీద అనాథ శవాలు ఏమైనా ఉన్నా.. ప్రమాదాల్లో చనిపోయిన జంతువులకు సొంత ఖర్చులతో అంత్యక్రియల్ని నిర్వహిస్తుంటాడు. పంచాయితీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కాటి కాపరి పని చేస్తారా? అని చాలామంది అడిగారని.. తనకు అన్నం పెట్టి.. ఇంత వాడిని చేసిన పనిని ఎందుకు వదిలేస్తానని చెప్పిన అరుణాచలం.. అన్నట్లే ఆ పనిని కంటిన్యూ చేయటం చూస్తే.. రాజకీయాల్లో ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని అనుకోకుండా ఉండలేం.