Begin typing your search above and press return to search.

పండన్న మూడో పెళ్లి ఇస్పెషల్.. ఇద్దరు భార్యలు కలిసి చేశారు

ఇదేం సినిమా స్టోరీ కాదు. రియల్ స్టోరీ. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఇలాంటిది సాధ్యమా? అనుకోవచ్చు.

By:  Tupaki Desk   |   1 July 2024 4:33 AM GMT
పండన్న మూడో పెళ్లి ఇస్పెషల్.. ఇద్దరు భార్యలు కలిసి చేశారు
X

ఇదేం సినిమా స్టోరీ కాదు. రియల్ స్టోరీ. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఇలాంటిది సాధ్యమా? అనుకోవచ్చు. కానీ.. ఇది నిజంగా నిజం. అప్పటికే ఇద్దరు భార్యలున్నప్పటికి.. తాము అనుకున్న దాని కోసం తమ భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి చేసేశారు. అంతేనా.. భారీ ఏర్పాట్లు చేశారు. కార్డులు కొట్టించారు. ఫ్లెక్సీలు తయారు చేయించారు. ఎందుకిలా? ఎక్కడ జరిగిందీ సిత్రం అన్న వివరాల్లోకి వెళితే..

పెళ్లి పెద్దలుగా మొదటి, రెండో భార్యలు కలిసి తమ భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి చేసిన ఆసక్తికర ఉదంతం అల్లూరి సీతారామారాజు జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వ్యవహారం.. వాట్సాప్ లో వైరల్ అయిన ఫోటోలు.. సమాచారంతోనే మొయిన్ స్ట్రీమ్ మీడియాకు విషయం వెల్లడైంది. దీంతో.. వారు ఎంట్రీ ఇవ్వటంతో మిగిలిన వివరాలు వెల్లడయ్యాయి.

జిల్లాలోని పెదబయలు మండలానికి చెందిన కించూరు గ్రామానికి చెందిన పండన్న అనే వ్యక్తికి 2000లో పార్వతమ్మ అనే మహిళతో పెళ్లి జరిగింది. అయితే.. వారికి సంతానం కలుగలేదు. దీంతో పిల్లల కోసం మొదటి పెళ్లి జరిగిన ఐదేళ్ల తర్వాత అంటే 2005లో అప్పలమ్మ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం రెండేళ్లకు వీరికో అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత మళ్లీ పిల్లలు పుట్టలేదు.

దీంతో.. మొదటి, రెండో భార్య అనుమతి తీసుకున్న పండన్న తాజాగా ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు.అది కూడా.. పిల్లలకోసం. భర్తకు ఇష్టమైన పిల్లల కోసం ఇద్దరు భార్యలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి మూడో పెళ్లి చేయించారు. ఇందుకోసం సంప్రదాయబద్ధంగా ఎలా అయితే పెళ్లి నిర్వహిస్తారో అలానే చేశారు. పెళ్లి కార్డులు కొట్టించి వివాహమహోత్సవాన్నిపూర్తి చేశారు. జూన్ 25న ఈ పెళ్లి జరిగిన వైనం బయటకు వచ్చింది. పెళ్లి వేళ కొట్టించిన ఫ్లెక్సీల్లో .. కాబోయే భార్య భర్తలిద్దరి భారీ ఫోటోలతో నడుమ.. మొదటి, రెండో భార్యల ఫోటోలతో కలిపి తయారు చేయించిన వైనం ఆసక్తికరంగానే కాదు.. వైరల్ గా మారింది. భర్త ఇష్టం కోసం ఇద్దరి భార్యల త్యాగం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.