Begin typing your search above and press return to search.

కోర్టు ఆదేశాలతో పందెం కోళ్లను వేలం వేయనున్న పోలీస్ స్టేషన్

పోలీస్ స్టేషన్ లో ఇదేం పని అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీనికి కారణం.. మంథని కోర్టు ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 5:08 AM GMT
కోర్టు ఆదేశాలతో పందెం కోళ్లను వేలం వేయనున్న పోలీస్ స్టేషన్
X

సిత్రమైన సీన్ కు కేరాఫ్ అడ్రస్ గా మారనుంది ఒక పోలీస్ స్టేషన్. తెలంగాణలోని ఒక పోలీస్ స్టేషన్ లో ఈ రోజు (మంగళవారం) పందెం కోళ్లను వేలం వేయనున్నారు. పోలీస్ స్టేషన్ ఏంటి? పందెం కోళ్లను వేలం వేయటం ఏమిటి? అన్న కన్ఫ్యూజన్ కు గురి కావొచ్చు. విషయం మొత్తం తెలిస్తే అసలు సంగతి అర్థమవుతుంది. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో పందెం కోళ్లను బహిరంగంగా వేలం వేయనున్నారు.

పోలీస్ స్టేషన్ లో ఇదేం పని అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీనికి కారణం.. మంథని కోర్టు ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారు. గత నెలలో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికల్ పేట శివారులో కోడి పందేలు ఆడేవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ లో కోళ్లకు ప్రత్యేకంగా బోను ఏర్పాటు చేసి.. వాటికి ఆహారాన్ని పెట్టటం.. మంచినీళ్లు ఇవ్వటం చేస్తూ.. వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ఈ విషయాల్ని తెలియజేయగా.. ఈ పందెం కోళ్లను బహిరంగ వేలంలో అమ్మేయాలని కోర్టు ఆదేశించింది.

దీంతో.. ఈ రోజు(మంగళవారం) ఉదయం 11 గంటల వేళకు కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో బహిరంగ వేలం వేయనున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటివి జరగకపోవటంతో చుట్టుపక్కల వారంతా ఈ వేలం గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా వేలం ఎంతకు వెళుతుంది? ఈ రెండు పందెం కోళ్లను ఎవరు సొంతం చేసుకుంటారన్నది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆసక్తికర చర్చగా మారింది.