Begin typing your search above and press return to search.

వైసీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై...ఆ పార్టీ కండువాతో రెడీ ?

వైసీపీ అధినాయకత్వం కూడా పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మాణం చేయాలో అన్న దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం లేదు అని అంటున్నారు

By:  Tupaki Desk   |   12 Nov 2024 3:37 AM GMT
వైసీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై...ఆ పార్టీ కండువాతో రెడీ ?
X

వైసీపీకి గోదావరి జిల్లాలలో వరస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ అధినాయకత్వం కూడా పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మాణం చేయాలో అన్న దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం లేదు అని అంటున్నారు.

మరీ ముఖ్యంగా వైసీపీకి అసలైన ముప్పు గోదావరి జిల్లాల నుంచి ముంచుకొస్తోంది. ఇక్కడ కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలు అంతా పార్టీకి గుడ్ బై కొడుతున్నారు. వారి స్థానంలో వైసీపీకి ఎవరూ దొరకడం లేదు, అధినాయకత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టాల్సి ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న ప్రచారం చూస్తే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు తన పదవికి పార్టీకి కూడా రాజీనామా చేసి ఫ్యాన్ నీడ నుంచి బయటపడాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయన మొదట్లో టీడీపీలో ఉండేవారు. టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా పనిచేసారు. ఇక గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరడంతో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పండులకు 2020లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అలా ఆయన నాలుగేళ్ళ పాటు పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నారు.

ఇక మరో రెండేళ్ళ పదవీ కాలం ఉండగానే ఆయన వైసీపీకి గుడ్ బై కొట్టాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీతో విభేదించి ఆయన బయటకు వచ్చారు. పైగా అమలాపురం ఎంపీగా మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు ఉన్నందువల్ల ఆ పార్టీ కంటే జనసేనలోకి చేరడం బెటర్ అని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఈ మేరకు ఆయన జనసేనలోని కీలక నేతలతో మాటా మంతీ పూర్తి చేశారు అని అంటున్నారు. దీంతో ఆయన తన రాజీనామా డెసిషన్ ని తొందరలోనే ప్రకటిస్తారు అని అంటున్నారు. ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడం లాంచనం అని అంటున్నారు. ఇక పండుల రవీంద్రబాబు ఐఆర్ఎస్ అధికారిగా సేవలు అందించారు. ఆయన సర్వీసులో ఉండగానే రాజకీయాల మీద ఆసక్తితో 2014లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు.

ఇక వైసీపీ అధినాయకత్వం మీద ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆయన సేవలను పార్టీ సక్రమంగా ఉపయోగించుకోలేదన్న బాధ ఆయనలో ఉందని అంటున్నారు. మొత్తానికి ఆయన వైసీపీ నుంచి బయటపడతారు అన్నది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గట్టిగా వినిపిస్తోంది. మరి పండుల కనుక పార్టీకి పదవికి రాజీనామా చేస్తే వైసీపీకి అది పెద్ద దెబ్బగానే ఉంటుందని అంటున్నారు.