మామ మామ ‘పన్నీరు’.. పనస కాయతో తన్నీరు.. మాజీ సీఎం కష్టాలు
ఆయన పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. ఒక పెద్ద పార్టీని పర్యవేక్షించిన నాయకుడు.
By: Tupaki Desk | 6 April 2024 3:30 PM GMTఆయన పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. ఒక పెద్ద పార్టీని పర్యవేక్షించిన నాయకుడు. కానీ, ఇప్పుడు చూస్తే ఆయనకు ఎన్నికల్లో టికెట్ లేదు.. పార్టీ లేదు.. చివరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. సరేలే.. గెలిస్తే చాలు అనుకుంటుంటే.. మరో పెద్ద చిక్కొచ్చి పడింది.
రామరామ.. ఆ నాథుడెవరు?
తమిళనాడులోని రామనాథపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆ రాష్ట్ర మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం. దివంగత జయలలిత మరణం అనంతరం ఈయన సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఓపీఎస్ గా అందరికీ సుపరిచితుడైన పన్నీర్ సెల్వంను అన్నా డీఎంకే పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో ఆ పార్టీ గుర్తు రెండాకుల మీద పోటీ చేసే అవకాశం కోల్పోయారు. అయితే, ఓపీఎస్
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, అదే పేరుతో మరో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఓటర్లకు ‘ఓ పన్నీర్‌సెల్వం’ విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈయనను దెబ్బతీసేందుకే డమ్మీ అభ్యర్థులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇక ఓ పన్నీర్ సెల్వం ఎన్డీఏ కూటమి తరఫున ఏకైక స్వంతంత్ర అభ్యర్థిని అని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, ఇదే పేరుతో ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్థికి బీజేపీ మద్దతు తెలుపుతోంది.
ఓ పన్నీర్‌సెల్వం పూర్తి పేరు ఒట్టకరతేవర్ పన్నీర్ సెల్వం. పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులకు పన్నీర్‌సెల్వం ఒచ్చప్పన్, ఒయ్యారం, ఒయ్యతేవర్, ఒచ్తేవర్ వంటి పేర్లు చేరి ఉన్నాయి. మెక్కిలార్‌పట్టి నుంచి ఓచప్పన్ పన్నీర్‌సెల్వం, రామనాథపురం నుంచి ఊయారం పన్నీర్‌సెల్వం తదితరులు కూడా బరిలోకి దిగడం గమనార్హం.
పనస కాయలతో ప్రచారం
ఓ.పన్నీర్ సెల్వంకు పనస కాయ గుర్తు వచ్చింది. దీంతో ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున పనసకాయలు కొని ఊరూరా పంచుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ పుణ్యమాని రోజూ టన్నుల కొద్దీ పనస కాయలు అమ్ముడవుతూ వస్తున్నాయి. రామనాథపురం ప్రాంతంలోని వ్యాపారులు రోజుకు 30-40 టన్నుల పనసకాయలు అమ్ముతున్నారంటే ఆశ్చర్యం లేదు. ఇదీ ఓ మాజీ సీఎంకు వచ్చిన కష్టాలు.