7 ఏళ్లలో 70 పైగా పేపర్ లీక్ లు.. యువత భవితకు మేకులు!
తెలంగాణలో గత ఏడాది జరిగి తొలి గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ ఎంతటి సంచలనం రేపిందో అందరూ చూశారు.
By: Tupaki Desk | 23 Jun 2024 10:49 AM GMTపరీక్ష పేపర్ లీక్ అయితే ఏం జరుగుతుంది? ఒక ఔత్సాహిక అభ్యర్థి కఠోర శ్రమ వేస్ట్ అవుతుంది.. అతడు కోచింగ్ కు వెచ్చించిన డబ్బు వేస్ట్ అవుతుంది.. వీటన్నిటికీ మించి ఎప్పటికీ తిరిగిరాలేని సమయం వేస్ట్ అవుతుంది.. అందుకే ప్రభుత్వాలు అత్యంత పటిష్ఠంగా పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు, యువత తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. కానీ, ప్రస్తుతం దేశంలో నీట్, నెట్ పేపర్ లీక్ రగడ జరుగుతోంది. దాదాపు 25 లక్షల మంది నీట్ పరీక్ష రాశారు. జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ భవిష్యత్ డాక్టర్లను అందిస్తుంది. అలాంటి పరీక్షలో అక్రమాలు జరిగి.. అనర్హులు వైద్యులైతే ప్రజల ప్రాణాల పరిస్థితి ఏమిటి?
తెలంగాణ నుంచి రాజస్థాన్ వరకు
తెలంగాణలో గత ఏడాది జరిగి తొలి గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ ఎంతటి సంచలనం రేపిందో అందరూ చూశారు. అంతకుముందు డివిజన్ ర్యాంక్ హోదా ఉండే డీఏవో పరీక్ష పేపర్, ఏఈఈ.. ఇలా పలు పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. అంతకుముందు ఎంసెట్ కూడా లీక్ అయింది. పలువురు విద్యార్థులు, అభ్యర్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదొక్క రాష్ట్రంలోనే కాదు.. గత ఏడేళ్లలో దేశంలోని 15 రాష్ట్రాల్లో 70 పైగా పేపర్లు లీక్ అయ్యాయంటే మనం నమ్మాల్సిందే. దీనిద్వారా 1.70 కోట్ల మంది యువత, విద్యార్థులు ప్రభావితం అయ్యారు.
లీకు రాష్ట్రాలు యూపీ, బిహార్, రాజస్థాన్
పరీక్షల కంటే లీకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బిహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్ అని చెప్పాల్సి ఉంటుంది. యూపీలో 40 లక్షల మంది హాజరైన కానిస్టేబుల్ పరీక్ష పేపర్ కూడా ముందే బయటకు వచ్చింది. చాలా రాష్ట్రాల్లో లీకులకు ప్రధాన కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులేనంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంటే.. తాము కష్టపడి వచ్చిన ఉద్యోగాన్ని.. మరొకరు కష్టపడకుండా పొందేలా డబ్బుకు అమ్ముతున్నారన్నమాట. రాజస్థాన్ లో అయితే యూజీసీ నెట్ సహా 14 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. గుజరాత్ దీ ఇదే స్కోరు. బిహార్ లో ‘రైల్వే ఉద్యోగాలకు భూమి’ కుంభకోణం బయటపడింది.
కట్టడి చేయకుంటే కష్టమే..
పేపర్ లీక్ ఒక మాఫియాగా మారింది. దీనిని నిర్దాక్షిణ్యంగా అణచివేయాలి. లేకుంటే దేశానికే ముప్పు. కాగా, కేంద్ర ప్రభుత్వం లీకేజీల నివారణకు కొత్త చట్టం తీసుకొచ్చినా.. అది పోస్ట్ మార్టం తరహాలోనే ఉంది తప్ప నివారణ మార్గాలను సూచించేలా లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
టెక్నాలజీ తోడుగా
పేపర్ లీకేజీని అరికట్టాలంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ సాయం తీసుకోవాలని తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో రాష్ట్రాలతో సమన్వయం పెంచుకోవాలని సలహా ఇస్తున్నారు.