వైరల్ ఇష్యూ... పోలీసులు స్ట్రైక్ చేస్తే ఎట్టుంటదో తెలుసా?
అవును... పోలీసులు స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుందో పపువా న్యూ గినియా దేశం చవి చూసింది
By: Tupaki Desk | 12 Jan 2024 2:30 AM GMTసినిమాల్లో తప్ప సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు అతిస్వల్పం కావొచ్చు! కారణం... ప్రజా భద్రతకే పుట్టినట్లుగా జీవించే పోలీస్ కు స్ట్రైక్ చేయాలనే ఆలోచన రాదు.. ఆ ఆలోచన వచ్చేటంత విరామము కూడా వారికి ఉండదు. అలాంటి పోలీస్ నిజంగా స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అని అంటుంది పసిఫిక్ దేశం పపువా న్యూ గినియా!
అవును... పోలీసులు స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుందో పపువా న్యూ గినియా దేశం చవి చూసింది. చీకట్లోనే తెలుస్తుంది దీపం విలువ – స్ట్రైక్ చేస్తేనే తెలుస్తుంది పోలీసులు అసలు విలువ అనే కామెంట్ ఇప్పుడు అక్కడ వైరల్ అయినా ఆశ్చర్యం లేదు. కారణం... జీతాల్లో కోత విధించడంపై ఆగ్రహంగా ఉన్న పోలీసులు సమ్మెకు దిగడంతో అక్కడి నేరగాళ్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. తమ పెఫార్మెన్స్ కు పని చెప్పారు!
వివరాళ్లోకి వెళ్తే... పపువా న్యూ గినియా దేశంలో జీతాల్లో కోత విధించిన కారణంగా పోలీసులు స్ట్రైక్ మొదలుపెట్టారు. దీంతో... రెచ్చిపోయిన నేరగాళ్లు రాజధాని పోర్ట్ మోరెస్బీలోని షాపుల్లోకి చొరబడి లూటీలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నిప్పు పెట్టారు! ఒక్కమాటలో చెప్పాలంటే... విధ్వంసం సృష్టించేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి!
బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ అల్లర్లలో సుమారు 15 మంది పౌరులు మృతి చెందినట్లు తెలుస్తుంది. వాస్తవానికి పపువా న్యూ గినియాలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అందుకు ప్రతిగా వారికి జీతాలు పెంచడం సంగతి అలా ఉంచి వాటిలో కోతలు విధించారు! దీంతో పోలీసులంతా ఒకేమాటమీదకు వచ్చి మెరుపు సమ్మెకు దిగారు.
ఇదే అదనుగా నేరగాళ్లు చెలరేగిపోయారు. షాపుల్లోకి చొరబడి చేతికి దొరికింది దొరికినట్లు ఎత్తుకుపోయారు. ఎంత చేయాలో అంతా చేశారు. దీంతో ఈ విషయాలపై అధ్యక్షుడు జేమ్స్ మరాపే స్పందించారు. పాలనాపరమైన లోపం కారణంగా వేతనాల్లో కోత విధించామని.. కొత్త పన్ను విధానం వారికి వర్తించదని స్పష్టం చేశారు.
దీంతో టెంపరరీగా విధుల్లో చేరిన పోలీసులు అల్లర్లను అదుపు చేయడానికి శ్రమిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో అక్కడి పరిస్థితిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ స్పందించారు. ఈ విషయానికి సంబంధించి అక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థన తమకు అందలేదని.. ఒకవేళ భద్రత పరంగా తమ మద్దతు కోరితే అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.