Begin typing your search above and press return to search.

ఘోర విషాదం.. 2,000కు చేరిన మృతుల సంఖ్య!

ఈ ఘటన అనంతరం.. తొలుత పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని భావించారు. కానీ... ఇప్పుడు లెక్కలు భారీగా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   27 May 2024 8:07 AM GMT
ఘోర విషాదం.. 2,000కు చేరిన మృతుల సంఖ్య!
X

శుక్రవారం తెల్లవారుజామున పాపువా న్యూగినీ దేశంలోని ఎంగా ప్రావిన్స్‌ లోని యంబాలి గ్రామంపై మౌంట్‌ ముంగాల కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు ఆ ప్రావిన్స్‌ లో చాలా ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయిన పరిస్థితి. ఈ ఘటన అనంతరం.. తొలుత పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని భావించారు. కానీ... ఇప్పుడు లెక్కలు భారీగా మారుతున్నాయి.

అవును... పాపువా న్యూగినీ దేశంలోని ఎంగా ప్రావిన్స్‌ లోని యంబాలి గ్రామంపై కొండచరియలు విరిగిన ఘటనలో... భారీ భవనాలు, పంటలు కూడా వీటి కింద చిక్కుకుపోయాయి. ఇదే సమయంలో ఈ ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరిగి.. అదికాస్తా వేలకు చేరింది. ఈ క్రమంలో తాజా పరిస్థితిని అక్కడి ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి వివరించింది.

ఇందులో భాగంగా... కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2,000 మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారని ఆ దేశంలోని నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్‌ నుంచి ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి సమాచారం వెళ్లింది. ఈ మేరకు సోమవారం ఉదయం దీనికి సంబంధించిన లేఖను ఆ కార్యాలయానికి పంపింది.

సుమారు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించడం.. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలు కుప్పలుగా పడటం వంటి విషయాలు ఈ ప్రమాద తీవ్రతకు అద్ధం పడుతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో శిథిలాల కిందే ఉండిపోయిన క్షతగాత్రుల ప్రాణాలకు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలకు ఇది అతిపెద్ద సవాల్‌ గా మారిందని అంటున్నారు.

ఈ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సైన్యం, ఇతర బృందాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్‌ సెంటర్‌ ద్వారా సమన్వయం చేసుకొంటామని ఆదేశ ప్రభుత్వం పేర్కొంది. మరోపక్క ఈ ప్రమాదం ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు.