విద్యార్థులతో చంద్రబాబు, పవన్... దేశంలో తొలిసారి కీలక కార్యక్రమం!
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
By: Tupaki Desk | 7 Dec 2024 8:18 AM GMTరాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున "తల్లితండ్రులు - ఉపాధ్యాయుల సమావేశం" ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటు పేరెంట్స్ తోనూ, ఇటు పిల్లలతోనూ ముచ్చటించారు. స్కూల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అవును... ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్ళో శనివారం నాడు "పేరెంట్స్ - టీచర్స్" మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా... బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ఎలా చదువుతున్నారు.. వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి మొదలైన విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఎంతో ముఖ్యమని, తల్లితండ్రులు కూడా తమ తమ పిల్లలు ఎలా చదువుతున్నారనే విషయాలపై ఎప్పటికప్పుడు దృష్టిసారించాలని.. తద్వారా మరింత మెరుగ్గా పిల్లలు విద్యలో రాణించే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో నారా లోకేష్ కూడా విద్యార్థులతో ముచ్చటించారు!
ఈ సందర్భంగా.. పిల్లల ప్రోగ్రస్ కార్డులు పరిశీలించిన చంద్రబాబు.. తల్లితండ్రులు, పూర్వ విద్యార్థులు ఇచ్చిన సూచనలు, సహలహాలు విన్నారు. సమావేశం అనంతరం విద్యార్థులు, తల్లితండ్రులతో కలిసి భోజనాలు చేశారు. వీటికోసం 23 ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు.
మరోపక్క... "పేరెంట్స్ - టీచర్స్" మీటింగ్ లో భాగంగా కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత పాఠశాల తరగతి గదులను పరిశీలించిన ఆయన... అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. వారు సృష్టించిన సైన్స్ పరికరాల గురించి స్వయంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన పవన్ కల్యాణ్... క్రీడల్లోనూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.