కెరీర్ పిచ్చలో మెషిన్లుగా మారిన ఈ పేరెంట్స్.. పాపను దత్తత ఇచ్చుడా?
దీనికి నిలువెత్తు రూపంగా మారిన ఒక దంపతుల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది.
By: Tupaki Desk | 3 April 2024 7:30 AM GMTనిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఉరుకుల పరుగులే. కెరీర్ లో అంతకంతకూ దూసుకెళ్లాలన్న తపన తప్పించి.. మరింకేదీ ముఖ్యం కాదన్నట్లుగా తయారయ్యారు. దీనికి నిలువెత్తు రూపంగా మారిన ఒక దంపతుల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. జాబ్ హడావుడిలో పడి తన చిన్నారిని సరిగా చూసుకోలేకపోతున్నట్లుగా పేర్కొన్న ఈ జంట.. తమ పాపను దత్తత ఇచ్చేందుకు సిద్ధం కావటం.. అందుకు తగ్గట్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.
రెడిట్ వేదికగా తమ మూడు నెలల పాప (ఎలిజబెత్)ను దత్తత ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా చిన్నారి తండ్రి ఒక పోస్టు చేశారు. దీని సారాంశం ఏమంటే.. ‘‘మా ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నాం. పాపను చూసుకోవటానికి సమయం ఉండట్లేదు. వర్కు హాలిక్ అయిన తాము ఉద్యోగాన్ని చేస్తున్నామే తప్పించి చిన్నారిని పెంచే విషయంలో ఏ పని చేయలేకపోతున్నాం. నా భార్య ఎలిజిబెత్ కు పాలు పట్టటం.. దుస్తులు మార్చటం.. స్నానం చేయటం తప్పించి ఇంకేమీ చేయట్లేదు. మేం ఎప్పుడు ఎలిజిబెత్ తో టైం గడపలేదు. మా చిన్నారిని వాల్ల అమ్మమ్మే చూసుకుంటోంది. బిడ్డను కన్న రెండు వారాలకే ఆఫీసులో చేరింది. వర్కు మీద ఆమెకున్న కమిట్ మెంట్ అలాంటిది. తమ పాపను అమ్మమ్మ కానీ.. బంధువులు కానీ.. స్నేహితులు కానీ చేసుకోవాలి. లేదంటే.. ఎవరైనా బయట వారికి దత్తత ఇచ్చేందుకు సద్ధంగా ఉన్నాం’’ అంటూ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.
ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఎలిజిబెత్ తండ్రి పెట్టిన ప్రపోజల్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు. ‘మీరు ప్రేమాభిమానాలు లేని రోబోలా.. లేదంటే మానవ జీవితాలతో ప్రయోగాలు చేస్తున్న గ్రహాంతర వాసులా?’’ అంటూ విరుచుకుడ్డారు. ఎంత కెరీర్ అయితే మాత్రం మూడు నెలల కన్న కుమార్తెను ఎవరికో అప్పగించేస్తున్న ఈ వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఒకవేళ.. పిల్లలకు టైం కేటాయించలేమన్నదే భావన అయితే పిల్లల్ని ఎందుకు కన్నట్లు? అని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. ఏమైనా.. కెరీర్ పరుగులో ఈ తరహా పేరెంట్స్ ను ఇప్పటివరకు చూడలేదన్న మాట పలువురి నోట వినిపిస్తుందని చెప్పాలి.