Begin typing your search above and press return to search.

ఆలోచింప చేస్తున్న ఫ్లకార్డ్... "టచ్" జ్ఞానం అమ్మాయిలకు మాత్రమేనా?

దీంతో ఎవరు ఎక్కడ ఏ ఉద్దేశ్యంతో టచ్ చేస్తున్నారనే విషయాన్ని పలువురు బాలికలు కూడా గుర్తించగలుగుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 1:30 PM GMT
ఆలోచింప చేస్తున్న ఫ్లకార్డ్... టచ్ జ్ఞానం అమ్మాయిలకు మాత్రమేనా?
X

గతకొంతకాలంగా, ప్రధానంగా ఇటీవల కాలంలో "గుడ్ టచ్ – బ్యాడ్ టచ్" పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా, వావీవరసలు చూడకుండా, కామంతో కళ్లుమూసుకుపోయిన కొంతమంది మూర్ఖులు చిన్న చిన్న పిల్లలను బ్యాడ్ గా టచ్ చేస్తూ శునకానందం పొందుతుంటారు!

ఈ సమయంలో ప్రతీ ఆడపిల్ల పేరెంట్స్.. ఆమెకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ మధ్య తేడాను అర్ధమయ్యేలా చెబుతున్నారు. దీంతో ఎవరు ఎక్కడ ఏ ఉద్దేశ్యంతో టచ్ చేస్తున్నారనే విషయాన్ని పలువురు బాలికలు కూడా గుర్తించగలుగుతున్నారు. ఇదే సమయంలో... ఆ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అబ్బాయిలకు నేర్పక్కరలేదా?

అవును... ఇప్పుడు ఈ ప్రశ్నే లేవనెత్తుతున్నారు హత్యాచార బాధితుల బందువులు, స్నేహితులు, సహచరులు, సన్నిహితులు, సానుభూతిపరులు. ఇతర మగాళ్లు ఎవరైనా తమ కూతురిని బ్యాడ్ గా టచ్ చేస్తున్నారా.. గుడ్ గా టచ్ చేస్తున్నారా గ్రహించడం ఎలా అనే విషయాలు నేర్పుతున్న తల్లితండ్రులు... తమ కుమారులకు కూడా నేర్పాలనేది ఇప్పుడు కీలక సూచనగా ఉంది.

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ హత్యాచారానికి వ్యతిరేకంగా నగరమంతా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ సమయంలో నిరసనకారులు ప్రదర్శించిన వాటిలో ఓ ఫ్లకార్డ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

ఆ ఫ్లకార్డుపై.. "గుడ్ టచ్ – బ్యాడ్ టచ్" గురించి మీ కూతురికి నేర్పిస్తున్నారు. అలాగే మీ కుమారుడికి కూడా దాని గురించి తెలిసి ఉండాలి" అని రాసి ఉంది. అంటే... పరాయి అమ్మాయిల పట్ల, ఇతర మహిళల పట్ల ఎలా వ్యవహరించాలనే జ్ఞానం అబ్బాయిలకు కూడా పేరెంట్స్ చిన్నప్పటి నుంచీ నేర్పించాలని ఈ ఫ్లకార్డు ద్వారా నిరసనకారులు కోరుతున్నారు!

పరాయి స్త్రీ శరీరంపై ఎవరికీ హక్కు ఉండదని.. అమ్మాయి అనుమతి లేకుండా ఆమె శరీరంపై చేయి వేసే హక్కు ఎవరికీ లేదని, అది ఉండకూడదని, అలా ఆలోచించే తప్పుడు ఆలోచనలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది బాల్యంలోనే అబ్బాయిలకు నేర్పించాలనే చర్చ ఇప్పుడు బలంగా నడుస్తుంది. పరాయి స్త్రీ శరీరం నిప్పు, తాకితే బ్రతుకు కాలిపోతుందనే భయాన్ని కూడా కలిగించాలని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆ ఫ్లకార్డులో పేర్కొన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా... కోల్ కతా ట్రైనీ డాక్టర్ పై హత్యాచారానికి నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ సేవలను నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది. ఇందులో అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.