బాబు వర్సెస్ స్వామి.. హిందూపురం రగడ!
ఇదొక చిక్కుముడి! పైకి పెద్దగా ఏమీలేదని భావిస్తున్నా.. దీని ఎఫెక్ట్ మాత్రం చాలానే ఉంటుందని మేధా వులు సైతం లెక్కలు కడుతున్నారు.
By: Tupaki Desk | 23 April 2024 2:30 PMఇదొక చిక్కుముడి! పైకి పెద్దగా ఏమీలేదని భావిస్తున్నా.. దీని ఎఫెక్ట్ మాత్రం చాలానే ఉంటుందని మేధా వులు సైతం లెక్కలు కడుతున్నారు. అదే.. హిందూపురం పార్లమెంటు స్థానం. ఇక్కడ నుంచి పోటీలో ఉన్న కాకినాడ సరస్వతీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి.. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఈ పరిణామం.. వైసీపీకి లాభిస్తుండగా.. ఇది కూటమి ఆశల రెక్కలపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న స్వామి.. హిందూపురం ఎంపీ టికెట్‌ను ఆశించారు.
కానీ, బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. పైగా.. ఈ సీటును బీజేపీ కాకుండా టీడీపీ తీసుకుంది. ఆ పార్టీ తరఫున అంబికా లక్ష్మీనారాయణకు కేటాయించింది. ఈయన బోయ సామాజిక వర్గానికి చెందిన నాయ కుడు. దీంతో ఇక్కడి సామాజిక వర్గం సమీకరణలో భాగంగా అంబికా గెలుస్తారని చంద్రబాబు లెక్కలు వేసుకుని ఉంటారు. మరోవైపు.. వైసీపీ ఇక్కడి సీటులో సరికొత్త ప్రయోగం చేసింది. కర్ణాటక మూలాలు ఉన్న జోలదరాశి శాంతకు అవకాశం ఇచ్చింది.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వామి పరిపూర్ణానంద.. స్వతంత్రంగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. వేచి చూసిన చంద్రబాబు.. ఆయన పరిస్తితిపై అంతర్గత నివేదిక తెప్పించుకున్నట్టు తెలిసింది. హిందూపురంలో గత మూడేళ్లుగా ఆయన ఉండి.. ప్రజలకు చేరువయ్యారు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిస్తే.. ఓటు చీలే అవకాశం ఉందని చంద్రబాబు గుర్తించారు.
దీంతో ఈయనను రెండు రోజుల కిందట.. పిలిచి మరీ మాట్లాడారు. కానీ, స్వామి శాంతించలేదు. చంద్రబాబుకు ఈయనకు మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. పోటీకి సై అన్నారు. ఈ పరిణామం.. టీడీపీకి ఇబ్బందిగా మారింది. మరి ఏం చేస్తారో చూడాలి. మరోవైపు.. వైసీపీకి కర్ణాటకలోని గాలి జనార్దన్‌రెడ్డి సహకారం కనిపిస్తోంది. శాంత.. ఈయనకు బంధువు కావడంతో ఆమెను గెలిపించుకునే చర్యలు చేపట్టారు.