పారిస్ రైళ్లకు నిప్పు ఒలింపిక్స్ కు ముందు తీవ్ర కలకలం
ఎలాగోలా క్రీడా సంరంభం మొదలైందని భావిస్తుండగా.. ఓ దుశ్చర్యతో 8 లక్షల మంది ఇబ్బందులకు గురవుతున్నారు.
By: Tupaki Desk | 26 July 2024 10:20 AM GMTఒలింపిక్స్ వంటి మహా క్రీడా సంగ్రామం ముంగిట ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో తీవ్ర కలకలం.. ఫ్యాషన్ రాజధాని స్పోర్ట్స్ రాజధానిగా అలరించనున్న వేళ ఆందోళనకర పరిణామం.. అసలే పలుసార్లు ఉగ్ర దాడులకు గురైంది ఫ్రాన్స్. అలాంటిచోట ఒలింపిక్స్ వంటి వాటి నిర్వహణ కత్తిమీద సామే. ఎలాగోలా క్రీడా సంరంభం మొదలైందని భావిస్తుండగా.. ఓ దుశ్చర్యతో 8 లక్షల మంది ఇబ్బందులకు గురవుతున్నారు. సరిగ్గా వందేళ్ల తర్వాత పారిస్‌లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 1924లో ఆ నగరంలో ఒలింపిక్స్ నిర్వహించారు.
కాసేపట్లో ఒలింపిక్స్ అనగా.. రైళ్లకు నిప్పు
ప్రపంచంలోని 206 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్స్ మరికాసేపట్లో జరుగుతాయనగా.. పారిస్ లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివెనుక ఎవరున్నదో తెలియదు కానీ.. ఇది ‘దురద్దేశ పూర్వక చర్య’ అని ఫ్రెంచ్ నేషనల్ రైల్ కంపెనీ ప్రకటించింది.
దేశంలోని పలు హైస్పీడ్ రైల్ సర్వీసులకు అంతరాయం వాటిల్లినట్లు తెలిపింది. నెట్ వర్క్ సేవలను స్తంభింపచేయడానికి భారీఎత్తున జరిగిన దాడులుగా వీటిని పేర్కొంది. పలు మార్గాల్లో రైళ్లు రద్దయ్యాయని.. కొందరు నిప్పంటించారని వివరించింది. దెబ్బతిన్న మార్గాల్లో సర్వీసుల
పునరుద్ధరణకు మరమ్మతులు చేపడుతున్నామని రైళ్లను దారిమళ్లిస్తున్నామని చెప్పారు. ఈ ప్రభావంతో మరిన్ని రైళ్లు రద్దయ్యే అవకాశం ఉంది. దేశ దక్షిణ ప్రాంతం వైపు హింసాత్మక చర్యలను గుర్తించి అడ్డుకున్నాం అని వెల్లడించింది.
ప్రణాళిక ప్రకారం విధ్వంసం
ప్రయాణికులు పర్యటనలను వాయిదా వేసుకోవాలని, స్టేషన్లకు దూరంగా ఉండాలని ఫ్రెంచ్ రైల్ కంపెనీ హెచ్చరించింది. ఒక ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని పేర్కొంది. కాగా, కనీవినీ ఎరుగని భద్రత మధ్య పారిస్ లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల నుంచి ఏడు వేల మంది పైగా క్రీడాకారులు ఒలింపిక్ పరేడ్ లో పాల్గొంటారు. ఈ ఒక్క కార్యక్రమానికే మూడు లక్షలమంది హాజరుకానున్నారు. అలాంటప్పుడు రైళ్లకు నిప్పు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒలింపిక్స్ కు అంతరాయం కలిగించే దురుద్దేశంతోనే ఇలా చేశారా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఒలింపిక్ నేపథ్యంలో.. శరణార్థులు, నిరాశ్రయులను పారిస్ నుంచి ఫ్రాన్స్ ప్రభుత్వం పంపించివేసింది. వందలాది మందిని క్రీడానగరం నుంచి తరలించి.. తాత్కాలిక శిబిరాల్లో వారికి బస కల్పించింది.